తిరుమలలో రాబోయే రోజుల్లో హోటళ్ళు, ఫాస్టు ఫుడ్ సెంటర్లు లేకుండా చేసి అన్ని ముఖ్య కూడళ్ళలో ఉచితంగా అన్నప్రసాదాలు అందించాలని టిటిడి పాలక మండలి నిర్ణయం తీసుకుంది. విఐపిలైనా.. సామాన్య భక్తుడికైనా ఒకే రకమైన ఆహారం అందించాలని తీర్మానం చేశామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
తిరుమల అన్నమయ్య భవనంలో టిటిడి పాలకమండలి సమావేశం గురువారం జరిగింది. ఈ ఏడాది 2022 – 23 వార్షిక బడ్జెట్‌ను రూ.3,096.40 కోట్లతో ఆమోదించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని అలిపిరి వద్ద సైన్స్‌సిటీ నిర్మాణానికి మంజూరు చేసిన 70 ఎకరాల భూమిలో 50 ఎకరాలు వెనక్కు తీసుకుని ఆధ్యాత్మిక నగరం నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు.
రూ.230 కోట్లతో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. హదయాలయం ప్రారంభించి వంద రోజుల్లో వంద ఆపరేషన్లు నిర్వహించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. రూ.2.73 కోట్లతో స్విమ్స్ ఆసుపత్రి కంప్యూటరీకరణకు ఆమోదం తెలిపారు.
టిటిడి ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించడానికి రూ.25 కోట్ల నిధి ఏర్పాటుకు ఆమోదించారు. అన్నమయ్య మార్గం త్వరలో భక్తులకు అందుబాటులోకి తేవడానికి ఇప్పుడు ఉన్న మార్గాన్ని అభివద్ధి చేయాలని, అటవీ శాఖ అనుమతులు లభించిన తరువాత పూర్తి స్థాయిలో అబివద్ధి పనులు చేపట్టాలని తీర్మానం చేశారు.
రూ.3.60 కోట్లతో టిటిడి ఆయుర్వేద ఫార్మసీకి పరికరాలు కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయుర్వేద మందులు అందుబాటులో వచ్చే విధంగా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. కరోనా కారణంగా నిలిపివేసిన శ్రీవారి ఆర్జిత సేవలను పునరుద్ధరించడంతో పాటు, సర్వ దర్శనం, శీఘ్ర దర్శనం టికెట్ల సంఖ్యను క్రమంగా పెంచాలని బోర్డు తీర్మానించినట్లు చెప్పారు.
అర్జిత సేవల టికెట్ల ధరలు కూడా పెంచాలని నిర్ణయించిందని తెలిపారు. సమావేశంలో ఇఒ కె.ఎస్.జవహర్ రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ హరిజవహర్ లాల్, అదనపు ఇఒ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
కాగా, టిటిడికి రూ.9.20 కోట్ల విరాళం అందింది. చెన్నై మైలాపూర్‌కు చెందిన డాక్టర్ ఆర్.పర్వతం కన్నుమూయడంతో ఆమె సోదరి రేవతి విశ్వనాథం ఆమె ఆస్తిని శ్రీ వేంకటేశ్వర స్వామికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
పర్వతం పేరు మీద బ్యాంకులో రూ.3.20 కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి. దీంతోపాటు రూ.6 కోట్ల విలువైన రెండు ఇళ్లు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పత్రాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో రేవతి విశ్వనాథం టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు.