చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో రంగరంగ వైభవంగా జరిగిన విశ్వ సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల సమస్రాబ్ధి వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దూరంగా ఉండడం రాజకీయ దుమారం రుపొంది. చినజీయర్ స్వామి తీరుతో కేసీఆర్ గుర్రుగా ఉన్నారనే ప్రచారం ఈ సందర్భంగా జరిగింది.
ఈ ప్రచారం పట్ల వారం రోజులుగా మౌనంగా ఉన్న జియ్యర్ స్వామి ఇప్పుడు ఈ ప్రచారాన్ని ఖండించారు. కేసీఆర్తో విభేదాలు లేవని తెలిపారు. సీఎం రాకపోవడానికి అనారోగ్యం లేదా.. పని ఒత్తిడి కారణం కావొచ్చని భావిస్తున్నానని చెప్పారు. పైగా, శనివారం జరిగే శాంతి కల్యాణానికి కేసీఆర్ను ఆహ్వానించామని చెబుతూ ఆయన హాజరు కాగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
దానితో ముచ్చింత్లో నేడు జరగబోయే 108 దివ్య దివ్యదేశాల శాంతి కల్యాణానికి కేసీఆర్ హాజరు కావడంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ముగింపు రోజు జరగాల్సిన శాంతికల్యాణాన్ని ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు చినజీయర్ స్వామి గత వారం ప్రకటించారు. ఈ వాయిదా సీఎం కేసీఆర్ కోసమేనంటూ ప్రచారం సాగుతోంది.
సీఎం సహకారం ఉన్నందుకే కార్యక్రమం విజయవంతమైందని పేర్కొంటూ ఈ కార్యక్రమానికి తాను ప్రథమ సేవకుడినని కేసీఆర్ అన్నారని చినజీయర్ స్వామి గుర్తుచేశారు. అయితే, ఆయన మాటలు వింటుంటే ఈ వేడుకలలో కేసీఆర్ పాల్గొనక పోవడంపై ఆయన నుండి ఎటువంటి సమాచారం లేదని, ఆ తర్వాత ఆయనతో మాట్లాడినట్లుగా కూడా లేదని స్పష్టం అవుతుంది. స్వపక్షం, ప్రతిపక్షం అనేవి రాజకీయాల్లోనే ఉంటాయని, తమకు అందరూ సమానమేనని చెప్పడం ద్వారా తాను ఎవ్వరి పక్షం వహించడంలేదనే సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు.
చిచ్చు రేపిన మోదీ పర్యటన
ఫ్రధాని నరేంద్రమోదీ పర్యటన.. సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి మధ్య చిచ్చురేపినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీరామానుజ మహా విగ్రహావిష్కరణ శిలాఫలకంలో సీఎం కేసీఆర్ పేరు లేకపోవడంతోనే ఇది మొదలైంది. సీఎం పేరు లేని విషయంపై సమాచారం అధికార వర్గాల ద్వారా సీఎంవోకు ముందుగానే అందింది.
అంతేకాదు.. కొందరు చినజీయర్ ఆశ్రమంలోని వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం మంచిదనే సంకేతాలను సీఎంకు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహం చెందిన సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉన్నట్లు భావిస్తున్నారు. అప్పటినుంచి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు.
శిలాఫలకం ఏర్పాటు విషయంలో ఈ విభేదాలు అన్ని మీడియా సృష్టేనని చిన జీయర్ స్వామి స్పష్టం చేశారు. పైగా, ప్రధాన మంత్రి కార్యాలయం సూచనల మేరకు శిలాఫలకంను తయారు చేశామని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొనేవారు పేర్లే అందులో ఉండాలని స్పష్టం చేసారని తెలిపారు.
ప్రతి ఒక్కరూ సమతామూర్తిని సందర్శించాలనేది తమ ఆకాంక్ష అని జియ్యర్ స్వామి చెప్పారు. సహస్రాబ్ది వేడుకల రెండో రోజులకు ముందే కేసీఆర్ ముచ్చింతల్ ఆశ్రమానికి వచ్చి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుమించి ఆయన ప్రత్యేకంగా సమతామూర్తిని దర్శించుకోలేదు.
కాగా, ఈ నెల 20 నుంచి సువర్ణమూర్తి విగ్రహాం భక్తులు దర్శించుకోవడానికి అందుబాటులోకి వస్తుందని చినజీయర్ స్వామి చెప్పారు. శ్రీ రామానుజ సువర్ణ మూర్తి దర్శనంతో పాటు, సందర్శకులకు మరింత సౌలభ్యం అందించేందుకు 108 దివ్యదేశాలలో ఎన్.ఎఫ్.సీ(నియర్ ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్), 3డి టెక్నాలజీని ఎటువంటి మరమ్మత్తులూ, అడ్డంకులూ రాకుండా మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని ఆయన తెలిపారు.