నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వన దేవతలైన సమక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, అమ్మవార్ల వన ప్రవేశంతో చేయనున్నారు.
సమ్మక్కను చిలుకల గుట్టకు, సారాలమ్మను కన్నేపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజు ను పూనుగొండ్లకు సాగనంపనున్నారు. ఆదివాసీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వన దేవతలంతా గద్దెలపై కొలువు దీరడంతో మేడారం జనసంద్రమైంది.
మహాజాతరలో మూడో రోజు శుక్రవారం లక్షలాది మంది భక్తులు తరలివచ్చి.. సమ్మక్క, సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. పసుపు, కుంకుమ, బంగారం, చీర, సారె, ఒడిబియ్యం సమర్పించారు.
సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, సమ్మక్క గద్దెలపైకి చేరడంతో శుక్రవారం భక్తులు వెల్లువలా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి, కుటుంబసభ్యులతో గద్దెల చెంతకు క్యూ కట్టారు. భక్తులు సమర్పించిన బంగారం (బెల్లం), ఇతర కానుకలతో గద్దెలన్నీ నిండిపోయాయి.
గత మూడు రోజులలో కోటి మందికి పైగా భక్తులు మేడారం జాతరకు వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం సారలమ్మను కన్నెపల్లి నుంచి గద్దెలపైకి తీసుకొచ్చే రోజు 30 లక్షల మంది, చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చిన గురువారం 40 లక్షల మంది, శుక్రవారం 30 లక్షల మంది భక్తులు మేడారం వచ్చారని పేర్కొన్నారు.
శుక్రవారం అమ్మవార్లను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయమంత్రి రేణుకాసింగ్, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తదితరులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
జాతరలో భక్తులకు ఏర్పాటుచేసిన సదుపాయాలను పర్యవేక్షిస్తూ భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామని మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.
ఈ మహాజాతర చివరిరోజు కావడంతో అమ్మవార్లను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హెలికాప్టర్లో మేడారానికి చేరుకోని దర్శించుకున్నారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మేడారం రానున్నారు.
లక్షలాదిగా భక్తులు రావడంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడుతున్నాయని అమ్మల దర్శనానికి రెండు గంటలు పడుతోందని తెలిపారు. శనివారం సాయంత్రం తల్లుల వనప్రవేశంలోగా మరో 10 నుంచి 15 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ శుక్రవారం మహాజాతరకు హాజరై సమ్మక్క, సారలమ్మను దర్శించుకుంటారని మొదట సీఎంవో ప్రకటించినా.. వెళ్లలేదు. వాతావరణం అనుకూలించకే కేసీఆర్ మేడారం పర్యటన రద్దయినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వలేదని ఏవియేషన్ అధికారుల ద్వారా తెలిసింది. రోడ్డు మార్గంలో వెళ్లాలని అనుకున్నప్పటికీ అప్పటికే సమయం దాటిపోవడంతో మేడారం ప్రయాణాన్ని కేసీఆర్ రద్దు చేసుకున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి.