కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయ్ అయిన మల్లన్న సాగర్ లోకి నీటిని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు విడుదల చేశారు. ప్రత్యేక పూజల అనంతరం స్విచ్ఛాన్ చేసి నీటిని విడుదల చేసి, రిజర్వాయర్ ను జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని ఎస్సారెస్పీ తర్వాత అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్. సిద్దిపేట జిల్లా తొగుట,కొండపాక మండలం సరిహద్దులో దీనిని నిర్మించారు. 8 గ్రామాలతో పాటు మొత్తం 14 శివారు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. దీని సామర్థ్యం 50 టీఎంసీలు.
సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్ పంప్ హౌస్ కు చేరిన గోదావరి జలాలను మల్లన్న సాగర్ లోకి ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్ తో మొత్తంగా ఉమ్మడి మెదక్ తో పాటు ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోని దాదాపు 11.29 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది.
ఈ రిజర్వాయర్ కు 5 తూములు(స్లూయిజ్ లు) ఉన్నాయి. వీటి ద్వారా కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్ కు, సింగూర్ ప్రాజెక్టుకు, తపాస్ పల్లి రిజర్వాయర్ కు,మిషన్ భగీరథకు నీటిని తరలిస్తారు. అంతేగాకుండా హైదరాబాద్ తాగునీటి కోసం 20 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం16 టీఎంసీలు వాడుతారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఆపేందుకు వందలది కేసులు వేశారని కేసీఆర్ ధ్వజమెత్తారు. పనులు ఆపాలని ఓ దుర్మార్గుడు కోర్టుకు కూడా వెళ్లాడంటూ మండిపడ్డారు. మల్లన్నసాగర్‌ను అడ్డుకునేందుకు 600 పైచిలుకు కేసులు వేశారని చెప్పుకొచ్చారు. ఎన్ని కేసులు వేసిన ఇంజినీర్లు భయపడలేదని, భయపడకుండా ప్రాజెక్టు పనులు పూర్తి చేశారని కొనియాడారు.
నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి హరీశ్ రావును కూడా అనేక ఇబ్బందులకు గురి చేశారని, ఆయనను కూడా బద్నాం చేసినారని విమర్శించారు. అయినా కూడా హరీశ్ రావు ఎక్కడ తగ్గకుండా ప్రాజెక్టు పనులు దగ్గరుండి పూర్తి చేశారని అభినందించారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ముందుకు వెళ్లామని చెబుతూ హరీశ్‌రావు సేవలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నాయని ప్రశంసించారు.
చాలా నిబద్ధతో మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మించామని చెబుతూ పూర్తి అవినీతి రహితంగా మల్లన్నసాగర్ నిర్మించుకున్నామని తెలిపారు. తెలంగాణ జల హృదయ సాగరం..మల్లన్నసాగర్ అంటూ కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్ ప్రాజెక్టు అని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించుకోవడం చారిత్రక ఘట్టమని తెలుపుతూ మహాయజ్ఞంలో పనిచేసిన ప్రతిఒక్కరికి కేసీఆర్ ప్రణామాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 58 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని చెబుతూ కొందరు దుర్మార్గులు కాళేశ్వరాన్ని ఆపేందుకు స్టే తెచ్చారని దుయ్యబట్టారు. అవినీతి రహితంగా వందకు వంద శాతం ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పారు.
జాతీయ రాజకీయాల ప్రభావితం
కాగా, జాతీయ రాజకీయాలు ప్రభావం చేసేలా ముందుకు సాగుతున్నానని కేసీఆర్ తెలిపారు. దేశాన్ని సెట్ రైట్ చేయడానికి ముందుకు పోతా అంటూ కొందరు నాయకులు ఇక్కడకి వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చిల్లర ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో మత కల్లోలాలు జరుగుతాయని ప్రచారం చేశారని విమర్శించారు.
దేశం కూడ దారి తప్పుతోందని, దేశంలో దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయని అంటూ కర్నాటకలో మతకల్లోలాలు లేపారని పరోక్షంగా బిజెపిపై విమర్శలు గుప్పించారు. సీఎం. ఎక్కడికక్కడ మత క్యాన్సర్ వ్యాపించకుండా కట్టడి కట్టడి చేయాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు. దేశంలో అతి తక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
మన రాష్ట్ర అభివృద్ది చూసి మహారాష్ట్ర సీఎం ఆశ్చర్య పోయారని పేర్కొంటూ ఏడేళ్ల కిందట తెలంగాణ ఎలా ఉండే ఇప్పుడెలా ఉంది? అంటూ ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో, ఏపీలో ఉన్న పరిస్థితులేంటి? పంజాబ్‌తో పోటీ పడుతూ ధాన్యం పండిస్తున్నామని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు ఇస్తున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రైతులు కాలర్ ఎగరేసి బతుకుతున్నారని తెలిపారు.
అద్భుతమైన గ్రామీణ తెలంగాణ ఆవిష్కరణ అవుతోందని, . మత్స్యపరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతోందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతోందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కేంద్రం సహకారం లేకున్నా అభివృద్ధిలో ముందున్నామని పేర్కొన్నారు. దేశాన్నే మార్గదర్శనం చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. పిడికెడు మందితో బయల్దేరితే తెలంగాణ సాకారమైందని అంటూ మిషన్‌భగీరథ దేశంలోనే ఎక్కడా లేదని స్పష్టం చేశారు.