మొత్తం ప్రపంచ మానవాళి గత కొంతకాలంగా ఆందోళన చెందుతున్న ఉక్రెయిన్ పై యుద్ధం నీడలు కార్యరూపం దాల్చాయి. ఇప్పటివరకు బెదిరిస్తూ వస్తున్న రష్యా, ప్రపంచ దేశాల ఆందోళనలను, అభ్యంతరాలను ఖాతరు చేయకుండా ఉక్రెయిన్‌లోకి రష్యా సైన్యం ప్రవేశించిం, ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై బాంబుల వర్షం కురిపించింది.
ఉక్రెయిన్ దేశంపై మిలటరీ ఆపరేషన్ మొదలైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్న పుతిన్ ఇప్పటికే చెప్పారు. రష్యా దాడులతో ఉక్రెయిన్ దేశం ఎమర్జెన్సీ విధించింది. ఉక్రెయిన్ ప్రభుత్వంరష్యాకు దీటుగా బలగాలు సిద్ధం చేసుకుంది.
రష్యా దాడి నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు.
రష్యా బాంబు దాడులతో కైవ్, ఖార్కివ్ నగరాల్లో పేలుళ్ల శబ్ధం వినిపించింది.తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడితో అట్టుడికింది. ఉక్రెయిన్‌లోని డాన్బాస్ ప్రాంతంలో ప్రత్యేక సైనిక చర్య నిర్వహించడానికి రష్యన్ దళాలకు అధికారం ఇచ్చామని వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు.
ఉక్రెయిన్ నుంచి వస్తున్న బెదిరింపులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నామని పుతిన్ తెలిపారు. అయితే తన పొరుగు దేశాన్ని ఆక్రమించాలనే లక్ష్యం తమకు లేదని రష్యా చెప్పింది.ఉక్రెయిన్ దేశంపై సైనిక ఆపరేషన్ విషయంలో బయటి దేశాల వారెవరూ జోక్యం చేసుకోవద్దని పుతిన్ కోరారు. ఈ సైనిక చర్యలో జోక్యం చేసుకునే వారిపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని పుతిన్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
ఉక్రెయిన్‌పై దండయాత్రకు ఆదేశించిన పుతిన్ గురువారం టెలివిజన్‌లో ప్రసంగీస్తూ ఉక్రెయిన్ నుంచి వచ్చిన బెదిరింపులకు ప్రతిస్పందనగా తాము దాడులు చేస్తునట్లు చెప్పారు. ఉక్రెయిన్ దేశంలో సైనికీకరణ నిర్వీర్వీకరణ లక్ష్యంగా తాము సైనిక చర్య ప్రారంభించామని టీవీ ప్రసంగంలో పేర్కొన్నారు. రష్యా ఉక్రేనియన్ దళాల మధ్య ఘర్షణలు అనివార్యం అని తెలిపారు.
ఉక్రేనియన్ సైనికులు తమ ఆయుధాలు వదిలి ఇంటికి వెళ్లాలని పుతిన్ పిలుపునిచ్చారు.‘‘ఇతరులు ఎవరైనా జోక్యం చేసుకుంటే, అన్నిటికంటే తీవ్ర పరిణామాలను మీరు ఎదుర్కొంటారు.’’ అని పుతిన్ హెచ్చరించారు.ఉక్రెయిన్ను నాటోలో చేరకుండా ఆపాలన్న రష్యా డిమాండ్‌ను అమెరికా, దాని మిత్రదేశాలు విస్మరించాయని ఆయన ఆరోపించారు.
ఉక్రెయిన్‌లో రష్యా చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి.పుతిన్ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘‘ఈ విధ్వంసానికి రష్యా మాత్రమే బాధ్యత వహిస్తుంది. అమెరికా, దాని మిత్రదేశాలు ఐక్యంగా నిర్ణయాత్మకంగా స్పందిస్తాయి. ప్రపంచం రష్యాను జవాబుదారీగా చేస్తుంది’’ అని హెచ్చరించారు.
ఉక్రెయిన్‌లో సైనిక కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు పుతిన్ ప్రకటించిన కొద్ది సేపటికే బైడెన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ రష్యా దాడి నిష్కారణమైనది, అన్యాయమైనదిగా మండిపడ్డారు. ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి సుమారు రెండు లక్షల మంది రష్యా సైనికులు, ఇతర ఆయుధాలను మోహరించిన ఫోటోలు విడుదలయ్యాయి.
రష్యాతో గురువారం జరుగుతున్న యుద్ధంలో ఐదు రష్యన్ విమానాలు, ఒక హెలికాప్టరును కూల్చివేసినట్లు ఉక్రెయిన్ మిలటరీ ప్రకటించింది. .అత్యవసర ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఉక్రెయిన్ ప్రతినిధి ‘‘యుద్ధాన్ని ఆపండి’’ అని అందరికీ విజ్ఞప్తి చేశారు. రష్యా దూకుడుకు ప్రతిస్పందించడానికి నాటో మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటామని జో బిడెన్ చెప్పారు.
భగ్గుమన్న ముడిచమురు ధరలు
మరోవంక, ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం ప్రారంభించడంతో గురువారం ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారెల్ 100 డాలర్లకు చేరింది. గడచిన ఏడేళ్లలో తొలిసారిగా అంతర్జాతీయ మార్కెటులో ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్ల మార్కును తాకింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల 2014వ సంవత్సరం తర్వాత తొలిసారిగా చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరాయి.2014వ సంవత్సరంలో ముడిచమురు బ్యారెల్ ధర 100 డాలర్లను అధిగమించింది.ఈ యుద్ధం వల్ల ఇంధనంతోపాటు గోధుమలు, లోహాల ధరలు పెరగనున్నాయి.
ఇటీవల కరోనా లాక్ డౌన్ల తర్వాత సంక్షోభం నెలకొంది.ఈ యుద్ధం ప్రపంచ ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగిస్తుందనే ఆందోళన రేకెత్తిస్తోంది.రష్యా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. ఇది ప్రధానంగా యూరోపియన్ రిఫైనరీలకు ముడి చమురును విక్రయిస్తుంది.
కాగా, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతామండలి మరోసారి అత్యవసరంగా సమావేశం కానుంది. మూడు రోజుల వ్యవధిలో రెండవసారి అత్యవసర సమావేశం నిర్వహించడం గమనార్హం. సైనిక మోహరింపు, తదితర పరిణామాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుందని దౌత్యవర్గాలు తెలిపాయి.
తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాదులు రష్యా సైనిక సహాయాన్ని అభ్యర్థించారని, రష్యా దాడితో తక్షణ ముప్పు ఉందని ఐరాసలోని ఉక్రెయిన్ రాయబారి సెర్గీ కిస్లిత్సా లేఖలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌కు ప్రాతినిథ్యం వహించాలని ఆయన కోరారు.