ఉక్రెయిన్‌పై రష్యాదాడి మొదలైంది. ఈ పరిస్థితుల్లో భారతీయులు ఎక్కడివారక్కడే ఆగిపోవాలని, సురక్షిత ప్రాంతాలకు చేరుకుని ఆ దేశంలో పరిస్థితులు చక్కబడేవరకు వేచి ఉండాలని భారత విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాల నుంచి ఆ దేశ రాజధాని కీవ్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్న భారతీయులంతా తిరిగి తమతమ ప్రదేశాలకు వెళ్లి పోవాలని కోరింది.
తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ సూచనలే పాటించాలని కోరింది. ఇప్పటికే విదేశాంగ శాఖ భారతీయుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. ఉక్రెయిన్ వివాదం తెరపైకి రాకముందు ఆ దేశంలో 22వేల మంది భారతీయులు ఉండేవారని అధికార వర్గాలు అంచనా వేశాయి. ఇందులో సుమారు వెయ్యిమంది వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు భారీ సంఖ్యలో భారత ఎంబసీ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో భయభ్రాంతులకు గురైన విద్యార్థులు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను అభ్యర్థించారు. దీంతో కొందరికి ఎంబసీలోనే బస ఏర్పాటు చేశారు. మరికొందరిని దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
దాదాపు 200 మందికి ఆశ్రయం కల్పించి వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇండియన్ ఎంబసీ అధికారులు ప్రకటించారు. విద్యార్థులతో మాట్లాడిన భారత రాయబారి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులను వీలైనంత తొందరగా స్వదేశానికి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మరోవంక, ఉక్రెయిన్ లో పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజీత్ దోవల్ ఈ భేటీలో పాల్గొన్నారు.
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను హంగేరీ సరిహద్దుల ద్వారా తరలించాలని నేతలు నిర్ణయించారు. ఇప్పటికే హంగేరీ, ఉక్రెయిన్ సరిహద్దుల్లోని జొహానైకు చేరుకున్న భారత ఎంబసీ సిబ్బంది అక్కడి ప్రభుత్వ సాయంతో ఇండియన్లనుభారతీయులనుహంగేరీకి తీసుకురానున్నారు. అక్కడి నుంచి వారిని స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఉద్రిక్తతలు ప్రారంభం కాగానే చాలామంది స్వదేశం బాట పట్టారు. మరికొందరు తాము చదువుతున్న యూనివర్శిటీల నుంచి సెలవు/ఆన్లైన్ క్లాసులకు సంబంధించి అధికారిక సమాచారం రాకపోవడంతో అక్కడే ఉండి పోయారు. ఉక్రెయిన్‌లో ఇంకా 20వేల మంది బారతీయులు ఉండవచ్చని అంచనా.
ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు ముఖ్యంగా విద్యార్థులకు సాయపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు న్యూఢిల్లీలో ఉన్న అధికార వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌లో వేగంగా మారుతున్న పరిస్థితులను గమనిస్తున్నామని కూడా వారు తెలిపారు.
ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను, దౌత్య సిబ్బందిని తరలించేందుకుగాను ప్రత్యేక విమానాన్ని పంపే ఆలోచన ఏదీ భారత్‌కు లేదు. ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి తెచ్చేందుకు గురువారం కీవ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం యుద్ధం కారణంగా, ఉక్రెయిన్ గగనతలం మూసివేత కారణంగా వెనక్కి వచ్చేసింది.