ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్ రష్యా జరిపిన దాడుల్లో భారతీయ పౌరుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ ట్విట్టర్లో వెల్లడించారు. మృతుడు కర్ణాటకలోని హవేరి జిల్లా వాసి నవీన్ శేఖరప్పగా గుర్తించి, వారి కుటుంబానికి సమాచారం అందించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
తాజా ఘటన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి స్పందిస్తూ భారత్‌లోని ఉక్రెయిన్, రష్యా రాయబారులతో ఆయన మాట్లాడారు. ఖార్కీవ్తో సహా ఇతర నగరాలలోని భారతీయులకు రక్షణ కల్పించాలని రెండు దేశాలను కోరారు. పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న భారతీయులు వెంటనే ఆ ప్రాంతాలను వీడాలని భారత్ రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీచేసింది.
నవీన్ ఉక్రెయిన్‌లో మెడిసిన్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. ఉదయం సూపర్ మార్కెట్ ముందు నవీన్ ఉండగా బాంబు దాడి జరిగింది. తీవ్రగాయాలతో నవీన్ మృతిచెందినట్లు కేంద్ర విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. రెండ్రోజులుగా ఖార్కివ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది.
ఇంకా ఖర్కివ్‌లోనే పెద్దసంఖ్యలో భారతీయ విద్యార్థులు ఉన్నారు. రష్యన్ బలగాల దాడితో భారతీయ విద్యార్థులు బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఖార్కివ్‌లో 4వేల మంది భారతీయ వైద్య విద్యార్థులు చిక్కుకున్నారు. వారంతా ప్రాణ భయంతో బంకర్లలోనే తలదాచుకున్నారు.
నవీన్ మృతితో ఒక్కసారిగా భారతీయులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. దేశం మొత్తాన్ని అతని మృతి కలచివేసింది. దీంతో నవీన్ కుటుంబ సభ్యులను కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఓదార్చారు. ఉక్రెయిన్‌లోని హవేరీకి చెందిన కర్నాటక విద్యార్థి నవీన్ జ్ఞానగౌడ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నవీన్ తండ్రి శేఖర్ గౌడ్‌తో ఫోన్లో మాట్లాడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
నవీన్ గురించి మరిన్ని వివరాలను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. ఈ దుఃఖ సమయంలో అతని కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. “ఇది పెద్ద దెబ్బ. నవీన్‌కు శాశ్వత శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈ విషాదాన్ని భరించడానికి మీరు ధైర్యంగా ఉండాలి” అని బొమ్మై సూచించారు.
మరోవైపు నవీన్ పార్థివదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారుని సీఎం బొమ్మై చెప్పారు. ఈ విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. నవీన్ గురించి పలు విషయాల్ని అతని తండ్రి సీఎంకు తెలిపారు.
కొడుకు పోయిన దుఖంలో ఉన్న తండ్రి శేఖర్ గౌడ్ తన కొడుకుతో ఉదయమే ఫోన్ లో మాట్లాడానని సీఎంకు చెప్పారు. రోజూ రెండు మూడుసార్లు ఫోన్ చేసేవాడని సీఎంకు ఆయన వివరించారు.
మరోవంక, ఉక్రెయిన్ పై రష్యా ఆక్రమణ కొనసాగుతోంది. ఉక్రెయిన్-రష్యా మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఖార్కివ్ ను రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి. జనావాసాలపైనా దాడులు జరిగినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యా దాడులను ఉక్రెయిన్ సేనలు దీటుగా తిప్పికొడుతున్నాయి.
కీవ్ పై పట్టు కోసం రష్యా సైనిక చర్యను ఉద్ధృతం చేసింది. ఒకిట్రికా నగరంలోని సైనిక స్థావరంపై రష్యా దాడి చేసింది. కీవ్ కు ఉత్తరాన సుమారు 65 కిలోమీటర్ల మేర భారీ స్థాయిలో రష్యా సైనికులు మోహరించారు.
ఖార్కీవ్ లో రష్యా దళాల మిసైల్ దాడులు జరిపింది. చారిత్రక భవనంపై బలగాలు విసైల్ దాడి చేశారు. రష్యా దాడిలో 70 మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం. ఇప్పటివరకు 5,710 మంది రష్యన్ సైనికులను హతమార్చామని ఉక్రెయిన్ ప్రకటించింది.