ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల చందన్ జిందాల్… అనారోగ్యం కారణంగా చనిపోయాడు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న భీకర దాడులతో కొందరు భారత విద్యార్థులు అక్కడ చిక్కుకున్నారు. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి రాలేకపోతున్నారు.
ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్‌లో ఉన్నవారి పరిస్థితి దయనీయంగా మారింది. ఈ క్రమలోనే పంజాబ్‌లోని బర్నాలాకు చెందిన చందన్ జిందాల్ (22) ఇవాళ అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. అతనికి రక్తం గడ్డ కట్టడంతో వెంటనే సమీప హాస్పిటల్‌కు తీసుకెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.
చందన్ విన్నిట్సియాలో నేషనల్ పైరోగవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. విన్నిట్సియాలో నాలుగేళ్లుగా చదువుతున్నాడు. ఫిబ్రవరి 2న అనారోగ్యానికి గురవ్వడంతో అతనికి శస్త్ర చికిత్స చేశారు.
ఫిబ్రవరి 7న అతని తండ్రి శిషన్ కుమార్, మామ కృష్ణకుమార్ అతనితో కలిసి ఉక్రెయిన్ వెళ్లారు. చందన్ మంగళవారం మృతి చెందినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. నిన్న రష్యా చేసిన బాంబు దాడుల్లో కర్నాటకకు చెందిన నవీన్ అనే వైద్య విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే.
ఇలా ఉండగా, ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో జరిగిన క్షిపణి దాడిలో భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప మంగళవారం మృతి చెందడంపై రష్యా స్పందించింది. నవీన్ మృతిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ ప్రకటించారు. ప్రస్తుతం ఉక్రెయన్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారతీయులందరికీ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఐక్యరాజ్య సమితిలో ఉక్రెయిన్, రష్యా సంక్షోభంపై భారత్ తటస్థ వైఖరి ప్రదర్శించడాన్ని రష్యా రాయబారి ప్రశంసించారు. ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో రష్యా జరిపిన దాడిలో 21 ఏళ్ల నవీన్ శేఖరప్ప మృతిచెందాడు. కర్నాటకకు చెందిన ఆయన ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు.
నిన్న సరుకులు తెచ్చేందుకు వెళ్లిన నవీన్ సూపర్ మార్కెట్ దగ్గర క్యూలో నిలబడి ఉండగా రష్యా జరిపిన బాంబు దాడిలో చనిపోయాడు.
పాక్ విద్యార్థులను కాపాడిన భారత జెండా
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం వల్ల అక్కడ చదువుకుంటున్న వివిద దేశాలకు చెందిన విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆయా దేశాలు తమ విద్యార్థుల కోసం ఉక్రెయిన్ ప్రభుత్వంతో పాటు చుట్టు పక్కల ఉన్న దేశాలతో కూడా మంతనాలు సాగిస్తున్నాయి.
ఈ తరహాలోనే భారత ప్రభుత్వం కూడా ఉక్రెయిన్‌లో ఉన్న భారత విద్యార్థులను తరలించడానికి చుట్టు పక్కల దేశాలను ఉపయోగించుకుంటోంది. యుద్ధం వల్ల చిక్కుకుపోయిన విద్యార్థులను రొమానియాకు బస్సుల ద్వారా తరలించి అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానాల ద్వారా భారత్ కు తరలిస్తున్నారు.
అయితే యుద్ధం భీకరంగా సాగుతున్న నేపథ్యంలో పలు దేశాలు తమ పౌరులను ఇప్పుడే తరలించడం రిస్క్ అని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఎలా అయినా ముందు ఉక్రెయిన్ నుంచి బయట పడాలని నిర్ణయించుకున్న పాక్ విద్యార్థులు కొందరు మన జాతీయ జెండా సాయంతో సేఫ్‌గా ఆ దేశ సరిహద్దు దాటగలిగారు.