వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల తన పాదయాత్రను మళ్లీ ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటడానికి వైఎస్ షర్మిల తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.
రాష్ట్రంలోని 90 నియోజకవర్గాలు 14 పార్లమెంట్ నియెజకవర్గాల్లో 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల పరిధి లక్ష్యంగా గతేడాది అక్టోబర్ 20న ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టారు. జిల్లాల్లో పర్యటిస్తూ..ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
స్థానిక సంస్థల ఎన్నికలు, కరోనా కారణంగా నవంబర్ 9న ఈ పాదయాత్ర వాయిదా పడింది. అయితే ఆ పాదయాత్రను ఈనెల 11 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇలా ఉండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ పర్యటనపై షర్మిల స్పందిస్తూ తెలంగాణాలో అమరులైన వారికి ఎందుకు సాయం చేయలేదని నిలదీస్తూ ట్వీట్ చేశారు. ‘గాల్వన్లో అమరులైన సైనిక కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వడం తప్పు కాదు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడంలో తప్పు లేదు’ అని ఆమె పేర్కొన్నారు.
అయితే, `తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సాయం ఎందుకు చేయరు..?. 1,200 మంది అమరులైనారని ఉద్యమంలో గొంతు చించుకున్నమీరు.. అధికారంలోకి వచ్చాక మీకు కొందరే అమరులెందుకయ్యారు?’ అంటూ ఆమె ప్రశ్నించారు.
నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న వందల మంది నిరుద్యోగులను ఎందుకు ఆదుకోరు?. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న వేల మంది రైతు కుటుంబాలను ఎందుకు ఆదుకోరు?. కనీసం నష్టపోయిన పంటకు పరిహారం ఎందుకివ్వరు?. అంటూ ఆమె నిలదీశారు.
సొంత రాష్ట్రం వారిని అల్లం, బయటి వారిని బెల్లం చేసుకోవడమేనా బంగారు భారత్కు బాట?’ అంటూ వైఎష్ షర్మిల సీఎం కేసీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించారు.