కొంతకాలంగా, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, రాష్త్ర గవర్నర్ డా . తమిళశై సౌందరరాజన్ లకు మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు భగ్గుమని వీధిన పడింది. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ విరుచుకు పడటం ప్రారంభించినప్పటి నుండి గవర్నర్ సహితం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు లభించిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.
ఎప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తడమే కానీ కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదని టి ఆర్ ఎస్ నాయకులు కొంతకాలంగా గవర్నర్ పట్ల తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే జరపబూనడం ద్వారా కేసీఆర్ గవర్నర్ తో ప్రత్యక్ష పోరుకు సిద్దపడిన్నట్లు స్పష్టం అవుతున్నది.
గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తమిళిసై తీవ్రంగా మండిపడ్డారు. సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభలను ఉద్దేశించి తాను చేయాల్సిన ప్రసంగాన్ని ఎత్తేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను కూడా తనకున్న రాజ్యాంగ అధికారాలను ఉపయోగించుకొని సభలో ఆర్థిక బిల్లు ప్రవేశానికి అనుమతి ఇవ్వడానికి మరింత సమయం తీసుకోవచ్చని, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే అనుమతి ఇచ్చానని చెప్పారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తూ గవర్నర్ పత్రికా ప్రకటన విడుదల చేయడం అనూహ్యంగా చెప్పవచ్చు.
మరోవంక, అధికార పక్ష నేతలు సహితం మీడియా లీక్ ల రూపంలో గవర్నర్ పై తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా వచ్చాక కూడా పాత వాసనలు వదులుకోలేదని ఘాటుగా విమర్శించారు.
ప్రభుత్వ నిర్ణయాలను ఆమోదించకుండా తిరస్కరించకుండా తొక్కిపట్టడం ద్వారా వాటికి విలువ లేకుండా చేశారంటూ పలు సందర్భాలను ప్రస్తావించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే రాష్ట్రంలో పని చేయలేరంటూ గత గవర్నర్లను ప్రస్తావిస్తూ పరోక్షంగా హెచ్చరించింది.
గవర్నర్ ప్రసంగమనేది గవర్నర్‌కు సంబంధించిన అధికార వ్యవహారం కాదని డా. తమిళశై స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే వివరాలతో కూడిన అధికారిక ప్రకటన మాత్రమేనని గుర్తు చేశారు. ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాల రిపోర్టు కార్డు అని ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న అంశాలపై సభలో అర్థవంతమైన చర్చలు చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
సాధారణంగా బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజు గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. దీనికి ప్రభుత్వం తరపున మంత్రివర్గం సమాధానమిస్తుంది. ఈ తతంగమంతా లేకుండానే నేరుగా సభా కార్యక్రమాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు సాంకేతిక అంశాన్ని అవకాశంగా మలచుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 8 వరకు శాసన సభ సమావేశాలు జరిగాయి. అనంతరం సమావేశాలను చాలిస్తున్నట్లు(ప్రొరోగ్) రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదన పంపలేదు. దాంతో గవర్నర్ సమావేశాల చాలింపు ప్రకటన చేయలేదు. నాటి సమావేశాల కొనసాగింపుగానే బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
శీతాకాల సమావేశాల చాలింపు ప్రకటన వెలువడనందున బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ప్రసంగం అవసరం లేదని, స్పీకర్‌తో సభను ప్రారంభించుకోచ్చని తెలిపాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, పశ్చిమ బెంగాల్లో, పాండిచ్చేరిలో ఇలా గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశాయి.
హుజురాబాద్ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నుండి వచ్చిన కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసింది. దాన్ని గవర్నర్ ఆమోదించలేదు. అలాగని తిరస్కరించనూ లేదు. చాలా కాలం తన దగ్గరే పెట్టుకున్నారు. అప్పటి నుండి గవర్నర్ కు, కేసీఆర్ కు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.
ప్రభుత్వ వర్గాలు కౌశిక్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని కోరినపుడు.. అతనిపై కేసులున్నాయని చెప్పారు. అలాంటప్పుడు తిరస్కరించాలని చెప్పినా అలా చేయలేదు. కేసులున్నా.. శిక్ష పడలేదుకదా? అని నివేదించినా పట్టించుకోలేదు.
మరోసారి, శాసనమండలికి ప్రొటెం చైర్మన్‌గా ఎంఐఎం సభ్యుడు అమీనుల్ జాఫ్రీని సిఫారసు చేస్తూ ఫైల్‌ను గవర్నర్‌కు పంపించారు. ఆమె నిర్ణయం తీసుకోకుండా నాన్చివేత ధోరణితో వ్యవహరించారు. ప్రొటెం చైర్మన్ ఎందుకు..? నేరుగా చైర్మన్ ఎన్నిక పెట్టుకోవాలని సలహా ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లో 13 నెలలపాటు ప్రొటెం చైర్మనే ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెప్పినప్పటికీ గవర్నర్ పట్టించుకోలేదు. చివరకు దేశంలో ఏయే రాష్ట్రాలు ప్రొటెం చైర్మన్లను ఎంత కాలం ఉంచాయన్న సమాచారాన్ని ఇవ్వడంతో జాఫ్రీ నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు.
గవర్నర్ జనవరి 26న జెండా ఎగురవేసిన తర్వాత.. ప్రభుత్వం ఆమోదించిన ప్రసంగాన్నే చదవాలి. సొంతంగా ప్రసంగాలు చేయడానికి వీల్లేదు. కానీ, ఈ సారి జనవరి 26న గవర్నర్ ప్రసంగాన్ని ప్రభుత్వం పంపించలేదు. ఆమె సొంత ప్రసంగాన్ని చదివారు.
వాస్తవానికి ప్రసంగానికి సంబంధించి ప్రభుత్వం గవర్నర్‌తో చర్చలు జరిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎలాగూ బహిరంగ సభ లేదు కాబట్టి ఎలాంటి ప్రసంగాలు వద్దనుకున్నారు. కానీ, గవర్నర్ ప్రసంగించారు. 2021-22 బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించని కొన్ని పేరాలను గవర్నర్ సొంతంగా చదివారు.
ఈ విధంగా గవర్నర్ ప్రభుత్వం పట్ల అసహన ధోరణితో పలు సందర్భాలలో వ్యవహరిస్తూ వచ్చిన్నట్లు అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో రాంలాల్ గవర్నర్‌గా ఉండగా.. నాటి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన చాలా అవమానకరంగా రాష్ట్రం నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.
కృష్ణకాంత్ గవర్నర్‌గా ఉన్నపుడు కూడా అలాగే జరిగింది. ఇటీవల మహారాష్ట్ర గవర్నర్ వ్యవహార శైలి కారణంగా శాసనసభ నుంచి అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. తెలంగాణలో ఇప్పటికీ గవర్నర్‌కు పరిస్థితులు చేయి దాటిపోలేదని, తీరు మార్చుకుంటే మంచిదని ప్రభుత్వవర్గాలు ఒక విధంగా హెచ్చరిక శాంతి సంకేతం పంపుతున్నాయి.