ప్రస్తుతం ఉక్రెయిన్ లో నెలకొన్న సంక్షోభాన్ని ముగించడం కోసం, రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాలకు పరిష్కారం కనుగోవడం కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో నేరుగా మాట్లాడాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధాని నరేంద్ర మోదీ సలహా ఇచ్చారు. నేడు ఆయనకు ఫోన్ చేసి 50 నిముషాల సేపు ప్రస్తుతం ఉక్రెయిన్ లో నెలకొన్న కల్లోల పరిస్థితుల గురించి మాట్లాడారు.
ఉక్రెయిన్, రష్యా బృందాల మధ్య చర్చల స్థితిగతులపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి వివరించారు. గత నెల 25న ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత పుతిన్ తో మోదీ మాట్లాడటం ఇది మూడవసారి. ఇంకా ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులు సురక్షితంగా ఆ దేశం విడిచి రావడానికి అవకాశం కల్పించామని కూడా ఈ సందర్భంగా ప్రధాని పుతిన్ ను కోరారు.
మరో వంక, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో ఆ దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ఇరు నేతలు చర్చించారు. అలాగే అక్కడ చిక్కుకున్న భారతీయులు, వారి తరలింపు గురించి మాట్లాడారు. ఉద్రిక్తతల తగ్గింపునకు సంబంధించి రష్యాతో ఉక్రెయిన్ కొనసాగిస్తున్న చర్చలపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జెలెన్స్కీని ఆయన అభినందించారు.
ఉక్రెయిన్ లోని భారతీయులను స్వదేశానికి పంపడంలో జెలెన్స్కీ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మోదీ ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 35 నిమిషాల పాటు జెలెన్స్కీ, మోదీ మధ్య చర్చలు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల తెలిపాయి.
రష్యా సేనలను ఉక్రెయిన్ సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న విధానాన్ని మోదీ ప్రశంసించారని, ఉక్రెయిన్ ప్రజల తరపున నిలిచినందుకు గర్వకారణం అంటూ జెలెన్స్కీ ఓ ట్వీట్ లో తెలిపారు.
‘‘రష్యా దురాక్రమణను ఉక్రెయిన్ ఎంత ధీటుగా ఎదుర్కొంటుందో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చెప్పాను. యుద్ధ సమయంలో తమ దేశ పౌరులకు చేసిన సహాయంపై భారత్ మమ్మల్ని ప్రశంసించింది. అలాగే శాంతి నెలకొల్పేందుకు హైలెవల్ చర్చలపై ఉక్రెయిన్ కమిట్మెంట్ను అభినందించారు” అని ఆయన చెప్పారు.
మరోమారు కాల్పుల విరమణ
ఉక్రెయిన్పై కాల్పులు, బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా మరోమారు కాల్పుల విరమణ ప్రకటించింది. కీవ్ తోపాటు ఉక్రెయిన్ లోని ఖర్కీవ్, మరియుపోల్, సుమీ నగరాల్లో కాల్పులను ఆపుతున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మక్రాన్ కోరడంతో ఉక్రెయిన్ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9 గంటల నుంచి (భారత్ టైమ్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి) కాల్పులను తాత్కాలికంగా నిలిపేశామని పేర్కొంది. దీంతో ఆయా నగరాల్లో ఉన్న భారతీయులతో పాటు ఇతర దేశస్తులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది.
ఇలా ఉండగా, యుద్ధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరణిస్తే.. ఏం చేయాలన్న దానిపై ప్లాన్స్ సిద్ధంగా ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. తాను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో మాట్లాడానని, అనుకోనిది ఏదైనా జరిగితే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారని పేర్కొన్నారు. ఈ వివరాలను తాను ఇప్పుడు బయటకు చెప్పలేనని స్పష్టం చేశారు