భారత్‌లో ప్రజాస్వామ్యం నానాటికీ బలహీనపడుతోందని..నిరంకుశత్వం దిశగా వెళ్తోందని తాజా నివేదిక హెచ్చరించింది. నిరంకుశత్వం దిశగా వెళ్తున్న ఎల్ సాల్విడార్, టర్కీ, హంగేరీ..మొదలైన టాప్-10 దేశాల్లో భారత్ ఉండటం ఆందోళన కలిగించే అంశమని స్వీడన్‌కు చెందిన ‘వి-డెమ్’ (వెరైటీస్ ఆఫ్ డెమొక్రసీ రీసెర్చ్ ప్రాజెక్ట్) నివేదిక వెల్లడించింది.
స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రజాస్వామ్యం..రెండు విభాగాల్లో 179 దేశాలకు ర్యాంకులు విడుదల చేయగా, ఇందులో భారత్‌కు వరుసగా..93వ ర్యాంక్, 100వ స్థానం దక్కింది. ”డెమొక్రసీ రిపోర్ట్ 2022 : ఆటోక్రటైజేషన్ ఛేంజింగ్ నేచర్?” అనే పేరుతో విడుదలైన ఈ నివేదికలో మరిన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
గత రెండు సంవత్సరాలతో పోల్చితే భారత్‌లో ఎన్నికల ప్రజాస్వామ్యం దెబ్బతింటోంది. దిగువన ఉండే 40నుంచి 50శాతం దేశాల జాబితాలో చేరుతోంది. పౌర హక్కులు, వాక్ స్వాతంత్య్రం, మైనార్టీ హక్కుల విషయంలో అత్యంత ప్రమాదకరమైన పోకడలు తలెత్తుతున్నాయి. పాలకులు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని దెబ్బతీస్తున్నారు.
ప్రతిపక్షాల్ని బలహీనం చేయడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. జాతీయ అతివాదాన్ని పెంచి పోషించడానికి, నియంతృత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు పాలకులు తమ అధికారాన్ని వినియోగిస్తున్నారు. భారత్, బ్రెజిల్, హంగేరీ, ఇండియా, పోలాండ్, సెర్బియా, టర్కీ..మొదలైన 10 దేశాలు నిరంకుశత్వం దిశగా వెళ్తున్నాయి.
మొత్తం ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం ఎన్నికల నిరంకుశత్వం ఉన్న దేశాల్లో ఉందని, 2020తో పోల్చితే 2021లో 44శాతం ప్రపంచ జనాభా (340కోట్లమంది) నిరంకుశత్వం నీడన ఉన్నారని నివేదిక పేర్కొన్నది.
తూర్పు యూరప్, మధ్య ఆసియా, ఆఫ్రికా, పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని తేలింది. ఎల్‌సాల్వడార్, నైజీరియా, ట్యునీషియా..మొదలైన 60దేశాల్లో ఎన్నికల నిరంకుశత్వం నెలకొందని నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ప్రజాస్వామ్యమే కీలకం
ప్రజా ఆరోగ్యం, సంరక్షణ, శాంతిసామరస్యం, సమన్యాయం, బలమైన రాజ్యాంగ సంస్థలు ఉండాలంటే ‘ప్రజాస్వామ్యమే పునాది’ అవుతుందని నివేదికలో పరిశోధకులు పేర్కొన్నారు. ”ప్రజాస్వామ్య పాలన ఉన్న దేశాల్లో కన్నా నిరంకుశత్వంలో ఉన్న దేశాల్లో అంతర్యుద్ధం, యుద్ధం ఎక్కువగా కనపడుతోంది.
అయితే భారత్‌లో ఎన్నికల నిరంకుశత్వం బలపడ్డాక, పాకిస్తాన్‌తో వివాదాలు పెరిగాయి. ఇరు దేశాల మధ్య గత 10ఏండ్లలో సైనికపరమైన వివాదాలు మూడు రెట్లు పెరిగాయి. నిరంకుశత్వం పెరగటంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులతోపాటు మేమూ ఆందోళన చెందుతున్నా”మని ‘వి-డెమ్’ పరిశోధకులు బృందం అభిప్రాయపడింది.