వైసిపి వేయి రోజుల పాలనపై ఎపి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, చినరాజప్ప, నక్కా ఆనందబాబు, దీపక్ రెడ్డి, అశోక్ బాబులు “వేయి రోజుల పాలన.. వేయి తప్పిదాలు” అంటూ ఛార్జ్ షీట్ విడుదల చేశారు. సీఎం జగన్ 1000 రోజుల పాలనలో వెయ్యి తప్పులంటూ.. పుస్తకంతోపాటు విధ్వంస పాలనలో 1000 నేరాలు, ఘోరాలు, లూటీలు, అసత్యాలు పేరిట టిడిపి ప్రజా ఛార్జ్ షీట్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ”అశుభంతో పరిపాలన ప్రారంభించిన ముఖ్యమంత్రి చరిత్రలో జగన్ ఒక్కరే. సమస్యల పరిష్కారానికి నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించారు. ప్రాంతీయ విద్వేషాల కోసమే మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారు” అని ఆరోపించారు.
మూడు రాజధానుల నిర్ణయంతో 135 సంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. రూ.2 లక్షల కోట్ల సంపద కలిగిన అమరావతిని నాశనం చేశారు. ఎప్పుడూ లేని విధంగా దేవాలయాలపై దాడులకు తెగబడ్డారు. మూడేళ్ల జగన్ పాలనలో అన్నీ నేరాలు ఘోరాలే ఉన్నాయి. సొంత బాబాయి వివేకాతో పాటు కోడెల, మాస్క్ అడిగిన వైద్యుడు సుధాకర్ ఇలా ఎంతోమంది చావులకు ఈ ప్రభుత్వమే కారణం అంటూ అచ్చెన్నాయుడు వివరించారు.
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు చినరాజప్ప మాట్లాడుతూ ”కక్షసాధింపు కోసమే జగన్ అధికారంలోకి వచ్చాడు. రాష్ట్రంలో సీఎం జగన్ చేసిన దాడులకు ఎన్నో పరిశ్రమలు తరలిపోయాయి. ఎస్సీ, ఎస్టీలపై మునుపెన్నడూ లేని విధంగా దాడులు చేశారు. దాడులు, కిడ్నాపులు బెదిరింపులతో స్థానిక సంస్థల ఎన్నికలను అపహాస్యం చేశారు. సొంత కంపెనీ సిమెంట్ ధరలు పెంచేందుకు ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నారు.” అని మండిపడ్డారు.
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ ”వెయ్యి రోజులుగా వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించిన ప్రభుత్వ నిర్ణయాలు.. రైతుల్ని మానసిక వేదనకు గురిచేస్తూనే ఉన్నాయి. రైతులకు ధాన్యం బకాయిలు సకాలంలో చెల్లించకుండా నెలలు తరబడి పెండింగులో పెడుతున్నారు” అని విమర్శించారు.
జగన్ పాలనలో పోలవరం ప్రశ్నార్థకమైందని ధ్వజమెత్తారు.వెయ్యి రోజుల్లో ఒక్క బోర్ వెల్ కూడా రైతులకు ఉచితంగా వెయ్యలేదని గుర్తు చేశారు. నిరాటంకంగా 9గంటల విద్యుత్ ఇవ్వకపోగా, లాలూచీ కోసమే వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తున్నారని విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలను దళారీ కేంద్రాలుగా మార్చారని ఆరోపించారు.