ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా, ఐరోపా దేశాలు కఠినమైన ఆర్ధిక ఆంక్షలు విధించడంతో, వెసులుబాటు కోసం రాయితీ ధరకు రష్యా ఇవ్వజూపిన ముడి చమురు కొనుగోలు విషయంలో భారత్ ఇరకాటంలో పడినట్లు కనిపిస్తున్నది. మిత్రదేశంగా, ముఖ్యంగా భద్రతా పరమైన అనుబంధం గల రష్యాకు ఇటువంటి సమయంలో అండగా ఉండడం అవసరం కాగా, మరోవంక, తన ఇంధన అవసరాల కోసం కూడా ఇది ఒక మంచి అవకాశం కాగలదు.
అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆర్ధిక ఆంక్షలతో మూడు చమురు, ఇంధనం లేకపోవడం, జర్మనీ వంటి ఐరోపా దేశాలు కూడా ఇంకా రష్యా నుండి కొనుగోలు చేస్తూ ఉండడంతో వాస్తవానికి భారత్ కు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. అమెరికా సహితం ముడిచమురు తమ ఆంక్షల పరిధిలోకి రాదంటూనే చరిత్రలో ఇటువంటి కీలక సమయంలో ఒక `దురాక్రమ’ దేశం వైపు ఉంది కలకం తెచ్చుకోవద్దని అంటూ భారత్ ను సున్నితంగా హెచ్చరిస్తున్నది.
ఇప్పటికే ఐక్యరాజ్యసమితి తదితర వేదికలపై ఓటింగ్ కు దూరంగా ఉండడం ద్వారా ఉక్రెయిన్ పై రష్యా యుద్దాన్ని ఖండించడంలో భారత్ తమతో స్వరం కలపలేదని ఆ దేశంలో కొంత అసంతృప్తితో ఉన్నాయి. మరోవంక, అధికారికంగా ఇప్పటి వరకు రష్యా దాడిని భారత్ ఖండించలేదు. కేవలం సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోమని రెండు దేశాలు సూచన మాత్రమే చేస్తున్నది.
ఈ దశలో రష్యా నుంచి భారతదేశం ఇంధన లావాదేవీలు సాగించడం వివాదాస్పదంగా మారే అవకాశం ఏర్పడుతున్నది. అయితే తమ దేశానికి ఇంధన లావాదేవీల వ్యవహారాల అమలు విషయంలో చట్టబద్ధత ఉందని, దీనిని తమ దేశం స్వీయ ప్రయోజనాల కోణంలో పాటిస్తుందని భారత్ స్పష్టం చేస్తున్నది.
రష్యా నుంచి చమురు దిగుమతుల వ్యవహారాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, ఇది ఆంక్షల వ్యాపారాల పరిధిలోకి వచ్చే అంశం కాబోదని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఓ వైపు అమెరికా కూడా రష్యా చమురును భారతదేశం తీసుకోవడంలో తప్పేమీ లేదని పేర్కొంటూనే ఇప్పటి సంక్షోభ దశలో దేశాల వైఖరి అనుగుణంగానే ఆయా దేశాలు ఏ పక్షం వైపు ఉన్నాయనేది నిర్థారించుకోవడానికి వీలుంటుందని పరోక్షంగా భారత్కు హెచ్చరికలు వెలువరించింది.
అతి తక్కువ ధరలకు అంటే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధరలతో బేరీజు వేసుకుంటే చౌక ధరలకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి)కు రష్యా 30 లక్షల బ్యారెల్స్ ముడిచమురు అందించేందుకు ప్రతిపాదించింది. ఇంధన అవసరాల నేపథ్యంలో భారతదేశానికి ఇది అత్యంత అరుదైన కలిసి వచ్చే అవకాశం.
దీనిని ఏ విధంగా కూడా కాదనడం భారత్కు కుదరదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే రష్యాపై అమెరికా ఆంక్షల కోణంలో ఈ ప్రతిపాదనను చూడరాదని, దీనిని తమ దేశ వ్యాపార ప్రత్యేకించి ఇంధన వ్యవహారాల కోణంలోనే చూడాల్సి ఉంటుందని భారతదేశం పేర్కొంది.
భారత్ అవసరాలలో ఇప్పటి వరకు రష్యా నుంచి కేవలం 1 శాతం మేరనే మూడు చమురు అందుతోంది. పది ఇతర దేశాల నుంచి ప్రధానంగా భారత్ చమురు అవసరాలను తీర్చుకుంటోంది. ఈ జాబితాలో రష్యా లేదు.
అయితే ఉక్రెయిన్లో పరిస్థితి నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ముడిచమురు ధరల నేపథ్యంలో తలెత్తే సవాళ్లను ఎందుర్కొనేందుకు, తలెత్తే ఒత్తిడిని తట్టుకునేందుకు అందుబాటులోకి వచ్చే అవకాశాలను వినియోగించుకోవడం భారతదేశానికి తప్పదు. ఈ దిశలోనే భారత్ ఇప్పుడు రష్యా ఆఫర్ను కాదనలేదు.
ఈ దిశలో అమెరికాను భారత్ కాదంటున్నట్లుగా నిర్థారించుకోరాదని భారత అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అత్యంత సున్నితమైన రీతిలో ఉన్న దౌత్య వ్యవహారాలను గమనిస్తూ రష్యా నుంచి సాయం విషయంలో భారతదేశం జాగ్రత్తగా పావులు కదుపుతోంది.
భారతదేశంలో రోజురోజుకీ విస్తరిస్తున్న ఇంధన అవసరాలను ప్రత్యేకించి పశ్చిమాసియా దేశాలు తీరుస్తున్నాయి. వీటిలో ఇరాక్ నుంచి 23 శాతం, సౌదీ అరేబియా నుంచి 18 శాతం, యుఎఇ నుంచి 11 శాతం చమురు దిగుమతి అవుతోంది.
భారత్కు అందుతోన్న అమెరికా కోటా ఇప్పటివరకూ 7.3 శాతంగా ఉంది. ఇప్పుడు రష్యా నుంచి భారీ స్థాయిలోనే ముడి చమురును అత్యల్ప ధరలకు తీసుకునేందుకు అవగాహన కుదుర్చుకోవడం ద్వారా భారతదేశం ఓ వైపు తన ఇంధన భవిష్యత్తును కాపాడుకుంటూనే మరో వైపు దౌత్య నీతిలో సవాళ్లను ఎదుర్కొవల్సి వస్తోంది.