ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విజృంభించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ఆందోళన వ్యక్తం చేసింది. అదేవిధంగా కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌పై వస్తున్న తప్పుడు ప్రచారం వల్ల కలుగుతున్న గందగోళ పరిస్థితిపై ఆవేదన చెందింది.
ప్రపంచ వ్యాప్తంగా 8 శాతం లేదా 11 మిలియన్లకు పైగా కేసులు వెలుగు చూశాయని డబ్ల్యుహెచ్ఒలో కరోనా సంబంధిత వ్యవహారాలు చూస్తున్న టెక్నికల్ లీడ్ డా. మరియా వాన్ ఖెర్కోవ్ స్పష్టం చేశారు. ఇతర కారణాలతో పాటు ఈ తప్పుడు సమాచారం కూడా కేసుల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తోందని తెలిపారు.
‘ఒమిక్రాన్ ప్రభావం అధికంగా లేదు, మహమ్మారి ముగిసిపోయింది అని మాకు పెద్ద మొత్తంలో తప్పుడు సమాచారమంతా అందింది. ఇదే మనం ఎదుర్కొవలసిన చివరి వేరియంట్ అంటూ ఫేక్ సమాచారం సృష్టించబడింది. ఇదే వైరస్ వ్యాప్తికి కారణమౌతోంది’ అని ఖెర్కోవ్ హెచ్చరించారు.
కరోనాను సమర్థంగా ఎదుర్కోవడానికి వ్యాక్సిన్లు ఒక్కటే మార్గమని ఖెర్కోవ్ ఉద్ఘాటించారు. ఒమిక్రాన్ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోందని, వీటిలో బిఎ1, బిఎ2 వేరియంట్లు ఉండగా. బిఎ2 ఈ వ్యాప్తి వేగానికి కారణమౌతుందని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు మనం చూసిన వైరస్లలో ఈ వేరియంట్‌దే అత్యంత వేగంగా ప్రసారం చెందుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ తప్పుడు సమాచారం వల్లే కేసులు, మరణాలు పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంటూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.