పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వానికి దేశ పార్లమెంట్లో వచ్చే వారం కీలక పరీక్ష ఎదురవుతుంది. ఈ నెల 25వ తేదీన దేశ జాతీయ అసెంబ్లీ సమావేశం ఏర్పాటుకు సభ స్పీకర్ అసద్ ఖైసర్ ఆదివారం ఆదేశాలు వెలువరించారు. దానితో ఆయన పదవికి గండం తప్పకపోవచ్చని కధనాలు వెలువడుతున్నాయి.
ద్రవ్యోల్బణం, ధరల పరిస్థితి ఇతర అంశాలను ప్రస్తావిస్తూ ఇమ్రాన్‌ఖాన్‌పై దేశ ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ, తరువాత బల నిరూపణకు ఓటింగ్‌కు పార్లమెంట్ ఈ నెల 25వ తేదీన భేటీ అవుతుండటంతో రాజకీయ వర్గాల్లో దీనిపై పలు ఊహాగానాలు చెలరేగాయి.
ఈ నెల 8వ తేదీననే పాకిస్థాన్‌కు చెందిన పిఎంఎల్‌ఎన్, పిపిపి ఎంపిలు దాదాపు వంద మంది సంతకాలతో అవిశ్వాస తీర్మానానికి నోటీసు వెలువరించారు. సోమవారమే పార్లమెంట్ భేటీ జరగాల్సి ఉందని, నిబంధనలను పాటించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.అయితే ఆదివారం స్పీకర్ కార్యాలయం నుంచి వెలువడిన అధికారిక సమాచారం ప్రకారం ఈ నెల 25వ తేదీన జాతీయ అసెంబ్లీ సమావేశం జరుగుతుంది.
వచ్చే శుక్రవారం ఉదయం 11 గంటలకు భేటీ జరుగుతుంది. అవిశ్వాసంపై చర్చ తరువాత బలపరీక్షకు మూడు నుంచి ఏడు రోజుల వ్యవధి ఉంటుంది. 342 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీలో ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ప్రతిపక్షాలకు 172 మంది ఎంపిల మద్దతు అవసరం ఉంటుంది.
మిత్రపక్షాల అస్పష్ట వైఖరి, స్వపక్షంలో కొందరు ఎంపిలు ఇటీవలే ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం, అన్నింటికి మించి దేశంలోని అత్యంత శక్తివంతం, రాజకీయాధికారాన్ని ఖరారు చేసే సైన్యం ఇప్పటివరకు తటస్థ వైఖరితోనే ఉండటంతో ఇమ్రాన్ ఖాన్ పిటిఐ పార్టీ అధికారం భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి.
రాజీనామా చేయమన్న ఆర్మీ చీఫ్!
అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సైన్యంపైనే గంపెడన్ని ఆశలు పెట్టుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఒక వేళ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి వస్తే సాయం చేయాలని ఇమ్రాన్ ఖాన్ కోరగా అందుకు ఆర్మీ చీఫ్ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
శనివారం ఆర్మీ చీఫ్జనరల్ ఖమర్ జావేద్ బాజ్వాతో ఐఎస్ఐ చీఫ్ భేటీ అయ్యారు. అంతేకాదు ఈ సమావేశంలో ఇమ్రాన్ ఖాన్‌కు ఆర్మీ చీఫ్ రాజీనామా చేయమనే సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అవిశ్వాసంలో గనుక ఓడితే ఈ నెలాఖరులో జరిగే ఆర్గనైజేషన్ ఆఫ్‌ది ఇస్లామిక్ కో ఆపరేషన్ సమావేశం తర్వాత రాజీనామా చేయాల్సిందిగా ఇమ్రాన్‌ఖాన్‌తో ఆర్మీ చీఫ్ బాజ్వా చెప్పినట్లు సమాచారం.
బాజ్వాతో పాటుగా మిగిలిన ఆర్మీ అధికారులు కూడా ఇమ్రాన్‌ఖాన్‌కు దిగిపొమ్మనే సలహా ఇచ్చినట్లు తెలిసింది. పదవీ గండాన్ని తప్పించుకునేందుకు ఇమ్రాన్ ఖాన్‌కు ఎలాంటి ఆస్కారం ఇవ్వకూడదని నలుగురు ఆర్మీ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీంతో ఇమ్రాన్‌ఖాన్‌కు దారులన్నీ మూసుకుపోయాయి.
ఇమ్రాన్ సొంతపార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ఇ ఇన్సాఫ్‌కు చెందిన 24 మంది ఎంపిలు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటేసేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీసుకువచ్చే అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఆర్మీకి డబ్బులిచ్చి ప్రభుత్వాన్ని కాపాడలేను
పాక్ ఆర్మీకి డబ్బులిచ్చి తన ప్రభుత్వాన్ని కాపాడుకోలేనని చెప్పడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ ఆదివారం తనకు సహకారం అందించని సైన్యం పట్ల తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. ఖైబర్ ఫఖ్తుంక్వాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ అదే సమయంలో ప్రభుత్వ వ్యవహారాలలో భారత సైన్యం జోక్యం చేసుకోదని అంటూ ప్రశంసలు కురిపించారు.
ఇదే సమయంలో భారత విదేశాంగ విధానంపై కూడా ప్రశంసలు కురిపించారు. భారత విదేశాంగ విధానాలు భారత దేశానికి మంచి చేస్తున్నాయని చెబుతూ దేశ పౌరుల కోసం భారత్ ఎంతకైనా తెగిస్తుందని, ఏ ఒత్తిళ్లకూ లొంగకుండా భారత్ ఉంటుందని పేర్కొన్నారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధ వేళ తటస్థ వైఖరి పాటిస్తూ అమెరికాతో సంబంధాలు కాపాడుకుంటూనే రష్యా నుంచి ముడిచమురు తక్కువ ధరకు కొనుగోలు చేశారని గుర్తు చేసారు.