కాల్పుల విరమణ ఒప్పందం గురించి రష్యా – ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చలు పురోగతిలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే కొన్ని సమస్యలపై ఈ రెండు దేశాల అధినేతలు ఒక నిర్ణయం తీసుకోవలసి ఉన్నట్లు ఈ చర్చలకు సారధ్యం వహిస్తున్న టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుట్ కావూసోగ్లు చెప్పారు.
“ఈ రెండు దేశాల ప్రతినిధులు ఇప్పటి వరకు తాము చెబుతున్న మాట్లా నుండి వెనుకకు వేళ్ళని పక్షంలో కాల్పుల విరమణ ఒప్పందంకు అవకాశాలు ఆశాజనకంగా ఉన్నట్లు చెప్పగలను” అని తెలిపారు.
అధికార జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ సమావేశానికి హాజరైనప్పుడు తన ఆశావాదాన్ని పునరుద్ఘాటిస్తూ, “పార్టీలు ప్రాథమిక సమస్యలపై ఒప్పందానికి దగ్గరగా ఉన్నాయని మేము చూస్తున్నాము,” అని కావుసోగ్లు పేర్కొన్నారు.
గత వారంలో, కావూసోగ్లు తన రష్యన్, ఉక్రేనియన్ సహచరులతో వరుసగా మాస్కో, ఎల్వివ్‌లలో సమావేశాలు నిర్వహించారు. శనివారం టర్కీ అధ్యక్ష ప్రతినిధి ఇబ్రహీం కలిన్ మాట్లాడుతూ, మాస్కో , కీవ్ ఆరు అంశాలపై చర్చలు జరుపుతున్నాయని, అవి “ఉక్రెయిన్ తటస్థత, నిరాయుధీకరణ, భద్రతా హామీలు, ‘డి-నాజిఫికేషన్’, రష్యన్ భాష వినియోగంపై అడ్డంకులను తొలగించడం. ఉక్రెయిన్, డాన్బాస్ స్థితి, క్రిమియా స్థితి” అని వివరించారు.
మార్చి 10న, టర్కీ రష్యా, ఉక్రేనియన్ విదేశాంగ మంత్రులను డిప్లమసీ ఫోరమ్‌లో వారి మొదటి ఉన్నత స్థాయి చర్చల కోసం టర్కీ ఆతిథ్యం ఇచ్చింది. అయినప్పటికీ చర్చలు కాల్పుల విరమణపై పెద్దగా పురోగతిని ఇవ్వలేదు. నేరుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో చర్చలకు సిద్ధమైతే గాని పరిష్కారం కుదిరే అవకాశం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చెబుతున్నారు. అయితే అందుకు పుతిన్ నుండి స్పందన రావడం లేదు.
ఇలా ఉండగా, రష్యాతో సంబంధాలున్న 11 రాజకీయ పార్టీల కార్యకలాపాలను తమ దేశంలో నిలిపివేయాలని జెలెన్స్కీ ఆదేశించారు. వాటిలో అతిపెద్దది ప్రతిపక్ష ప్లాట్‌ఫారమ్ ఫర్ లైఫ్ ఒకటి. దీనికి దేశ పార్లమెంటులోని 450 సీట్లలో 44 సీట్లు ఉన్నాయి.
మెద్వెడ్చుక్ కుమార్తె గాడ్ ఫాదర్ అయిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్న విక్టర్ మెద్వెడ్చుక్ ఈ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. యెవెనియ్ మురాయేవ్ నేతృత్వంలోని నాషి (మాది) పార్టీ కూడా జాబితాలో ఉంది.
రష్యన్ దండయాత్రకు ముందు. ఉక్రెయిన్ నాయకుడిగా మురాయేవ్ను నియమించాలని రష్యా కోరుకుంటోందని బ్రిటిష్ అధికారులు హెచ్చరించారు. ఇలా ఉండగా, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు జరుగుతున్న చర్చలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధం అనివార్యమని జెలెన్స్కీ రెండు రోజుల క్రితం హెచ్చరించారు.
కెమికల్ ప్లాంట్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్
కాగా, తూర్పు ఉక్రేనియన్ నగరమైన సుమీ శివార్లలోని ఓ కెమికల్ ప్లాంట్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ అవుతోంది. సోమవారం తెల్లవారుజాము నుండి గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తించారు. రష్యా దళాలు నగర శివార్లలోని రసాయన కర్మాగారాన్ని టార్గెట్ చేసి దాడులు చేయడం వల్ల గ్యాస్ లీక్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
సుమీ ప్రాంతీయ గవర్నర్ డిమిట్రో జైవిట్‌స్కీ తన అధికారిక టెలిగ్రామ్ ఛానెల్లో గ్యాస్ లీక్ గురించి ప్రకటించారు. గ్యాస్ లీక్ ప్రభావం దాదాపు 2.5 కిమీ (1.5 మైళ్ళు) విస్తీర్ణం వరకు కనిపించిందని పేర్కొన్నారు. గ్యాస్ లీక్ వల్ల ప్రస్తుతానికి సుమీ నగరానికి ప్రత్యక్ష ముప్పు లేదని ఆయన తెలిపారు. అయితే గాలి వీస్తున్న దిశలో ఉన్న నోవోసెలీట్యా పట్టణాన్ని ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
మరో రష్యా జనరల్ ను మట్టుబెట్టామని ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. ఇప్పటి వరకు 14 వేల 700 మంది రష్యా సైనికులు హతమైనట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. 476 యుద్ధ ట్యాంకులు, 1487 సాయుధ వాహనాలు, 96 విమానాలను ధ్వంసం చేశామని ప్రకటించారు. 118 హెలికాప్టర్లు, 21 యూఏవీలను నేలకూల్చినట్లు చెప్పారు. రష్యాకు చెందిన ఎయిర్ బోర్న్ రెజిమెంట్ మొత్తాన్ని తమ దళాలు నాశనం చేశాయని ఉక్రెయిన్ ప్రకటించింది.