ఎపి అసెంబ్లీలో సోమవారం కూడా రసాభాస చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం మరణాలు, పెగాసస్ అంశాలు అసెంబ్లీని కుదిపేశాయి. అధికార విపక్ష సభ్యుల వాగ్వివాదంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఒకరోజుపాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. పెగాసస్‌పై చర్చకు వైసిపి డిమాండ్ చేసింది.
జంగారెడ్డిగూడెం మరణాల అంశంపై సభలో చర్చకు ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి నినాదాలతో నిరసన చేశారు. జంగారెడ్డి గూడెం మరణాలపై జుడీషియల్ విచారణకు డిమాండ్ చేశారు.
మార్షల్స్ సహకారంతో సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లేటట్లు చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. టిడిపి సభ్యులు బల్లలు ఛరుస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో టిడిపి సభ్యులను సభాపతి శాసససభ నుంచి ఒక్కరోజు సస్పెండ్ చేశారు.
అసెంబ్లీ టిడిపి సభ్యుల ఆందోళనపై నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. సభలో సంస్కారవంతంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని అన్నారు. ‘ఇది శాసససభ.. వీధి మార్కెట్ కాదు.. మీరు వీధి రౌడీలు కాదు ‘ అంటూ టిడిపి సభ్యులను ఉద్దేశించి స్పీకర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
సభ పట్ల, స్పీకర్ పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సభా గౌరవాన్ని దిగజార్చడమే లక్ష్యంగా టిడిపి సభ్యులు ప్రవర్తిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ప్రభుత్వంపై అపోహలు సఅష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
సభలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో బెంగాల్ సిఎం వ్యాఖ్యలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రస్తావించారు. పెగాసస్‌పై చర్చకు చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి నోటీస్ ఇచ్చారు. స్వల్ప కాలిక చర్చ చేపడతామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.
పెగాసస్ పై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చర్చ ప్రారంభిస్తూ పెగాసస్ అంశాన్ని సుప్రీం కోర్టు సీరియస్‌గా తీసుకుందని గుర్తు చేశారు. పెగాసస్‌పై కమిటీ వేసి సుప్రీం దర్యాప్తు చేపట్టిందన్నారు. చంద్రబాబు హయాంలోనే పెగాసస్‌ను వాడారని బెంగాల్ సిఎం మమతా బెనర్జీ చెప్పారని మంత్రి పేర్కొన్నారు.
పెగాసస్ సాప్ట్వేర్ ద్వారా ఫోన్లు ట్యాపింగ్ చేసే అవకాశముందని చెబుతూ పెగాసస్‌పై చర్చించి కమిటీకి రిపోర్ట్ చేయాల్సి బాధ్యత ఉందని మంత్రి స్పష్టం చేశారు. కాగా, నేటి ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో.. పలు సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టనున్నారు.
మరోవంక, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు జంగారెడ్డిగూడెం బయలుదేరారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి ప్రత్యేక బస్సులో జంరెడ్డిగూడెంకు ఎమ్మెల్యేలు పయనమయ్యారు.
కల్తీ నాటుసారా మృతుల కుంటుంబాలను టీడీపీ ప్రజాప్రతినిధులు పరామర్శించనున్నారు. పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.లక్ష పరిహారం ఇవ్వనున్నారు. మొత్తం 27 కుటుంబాలకు రూ.27 లక్షల పరిహారాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు ఇవ్వనున్నారు.