చట్టసభల్లోకి బీసీలను తీసుకొచ్చేందుకే బీఎస్పీ కృషి చేస్తదని చెబుతూ వచ్చే ఎన్నికల్లో బీసీలకు 70 సీట్లిస్తామని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఆయన మొదలుపెట్టిన ‘బహుజన రాజ్యాధికార యాత్ర’ 19వ రోజు నార్కట్‌పల్లి మండలంలో అక్కినపల్లి గ్రామంకు చేరిన సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ బహుజన రాజ్యాధికారం కోసం పేద ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపారు.
‘బహుజన రాజ్యాధికారం కోసం పేద ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. బంగారు తెలంగాణ కాదు.. బాధల తెలంగాణగా మార్చారు. మంత్రుల జీతాలు ప్రతి నెల ఒకటవ తారిఖున వస్తున్నాయి.. కానీ పింఛన్ ఈ రోజు 24 తారీఖు వరకు కూడా ఇవ్వలేదు’ అంటూ పేర్కొన్నారు.
యాసంగి వడ్ల కొనుగోలు బంద్ చేశారని చెబుతూ ఎన్నికల కోసం కేసీఆర్ వడ్ల డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు నిర్మించి వడ్లు కొనుగోలు చెయ్యకపోతే లాభం ఏంటి? అని ప్రశ్నించారు. డిస్కంలకు తెలంగాణ రాష్టం రూ 17 వేల కోట్ల బాకీ ఉంది. అందుకే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచారని విమర్శించారు. రాష్ట్ర భారాన్ని పేదల మీద రుద్దడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
విద్యుత్ కొనుగోలు చీకటి ఒప్పందంగా కనిపిస్తోందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పేద ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకంజలో ఉందని, కనీస సౌకర్యాలు లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని విమర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణ చెయ్యలేదు కానీ బంగారు భారత్ అంటున్నారని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ ఏమో కానీ అవినీతి ఆరోపణలు మాత్రం ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ప్రజల విశ్వసనీయత కోల్పోయారని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. రూ. 600 కోట్లు ఇచ్చి ప్రశాంత్ కిషోర్‌ను ఎందుకు తెచ్చుకున్నాడు? అని ప్రవీణ్ ప్రశ్నించారు.