నెల రోజులకు పైగా ఒక వంక రష్యా సేనలు పొరుగున ఉన్న ఉక్రెయిన్ లో భీకర పోరాటం చేస్తుండగా, అందులో కీలక పాత్ర పోషింపవలసిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, జనరల్ స్టాఫ్ చీఫ్ జనరల్ వాలెరీ గెరాసిమోవ్ ఎక్కడా కనిపించడం లేదు. యుద్ధ పనులలో తీరిక లేకుండా ఉండడంతో మీడియా ముందుకు రాలేకపోవచ్చని కొందరు ప్రభుత్వ అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా, వారి ఉనికి పట్ల బలమైన అనుమానాలు చెలరేగుతున్నాయి.
యుద్ధంలో అనుకున్న విధంగా రష్యా సేనలు పురోగతి సాధింపలేక పోవడం, ప్రధాన నగరాలను స్వాధీనంలోకి తెచ్చుకోలేక పోవడం, భారీ స్థాయిలో సేనలను కోల్పోవలసి వస్తుండడంతో వీరిద్దరూ `శిక్షకు’ గురయ్యారా అనే బలమైన అనుమానాలు ఈ సందర్భంగా వ్యక్తం అవుతున్నాయి.
రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు గత గురువారం ప్రభుత్వ ఆధీనంలోని టివి ఛానెల్లో క్లుప్తంగా కనిపించారు. సుమారు ఒక వారం తర్వాత ఆయన మొదటిసారి బహిరంగంగా కనిపించారు. అయితే టివిలో అట్లా కనిపించి వెళ్ళిపోయినా, ఆయన గురించిన పుకార్లకు అడ్డుకట్ట పడటం లేదు. వర్చువల్ మీటింగ్‌లో రష్యా 24లో పాల్గొన్న షోయిగును కొన్ని సెకన్ల పాటు చూపించారు. సమావేశం ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలియలేదు.
సిఎన్ఎన్ కధనం ప్రకారం “షోయిగు ఉక్రెయిన్‌లో సైనిక చర్యపై జాతీయ భద్రతా మండలికి రిమోట్‌గా నివేదిక ఇస్తున్నాడు. ప్రత్యక్ష ఇంటర్వ్యూకి అంతరాయం కలిగించిన ప్రసార ఫుటేజీలో షోయిగు మాట్లాడినట్లు కనిపించలేదు, అయితే [రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్] పుతిన్‌కి నివేదించిన ఇతర వీడియో కాల్లో పాల్గొనేవారిలో అతని చిత్రం తెరపై కనిపించింది”.
షోయిగు చివరిసారిగా మార్చి 18న ఛానల్ వన్ ప్రసారంలో కనిపించాడని సిఎన్ఎన్ పేర్కొన్నది. అయితే, కొంతమంది స్థానిక పాత్రికేయుల కధనం ప్రకారం షోయిగు కనిపించిన సంఘటన మార్చి 11న జరిగిందని తెలుస్తున్నది. ఆయన గుండె సమస్యలతో బాధపడుతున్నాడని రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ రష్యా పరిశోధనా ఔట్లెట్ ఏజెంట్స్ట్వో బుధవారం నివేదించిన తర్వాత షోయిగు గురించి పుకార్లు వ్యాపించాయి.
క్రెమ్లిన్ ప్రతినిధి సిఎన్ఎన్ తో మాట్లాడుతూ “ప్రస్తుతం రక్షణ మంత్రి తన తీరిక లేకుండా ఉన్నారు….. ప్రత్యేక సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. సహజంగానే, ఇప్పుడు మీడియా కార్యకలాపాలకు సరైన సమయం కాదు. …. “
షోయిగుతో పాటు, జనరల్ స్టాఫ్ చీఫ్ జనరల్ వాలెరీ గెరాసిమోవ్ కూడా ఎక్కడా కనిపించడం లేదు. ది గార్డియన్ కదం ప్రకారం “ఖార్కివ్ లేదా కైవ్ వంటి కీలకమైన ఉక్రేనియన్ నగరాలను స్వాధీనం చేసుకోవడంలో విఫలమై, రష్యాను ఆర్థిక ఒంటరితనంలోకి నెట్టిన దాడిలో వారు శిక్షకు గురయ్యారని పుకార్లు వ్యాపించాయి.”
క్రెమ్లిన్‌లో కీలకమైన వ్యక్తి అయిన అనాటోలీ చుబైస్, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వాతావరణ రాయబారి పదవికి రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత షోయిగు, గెరాసిమోవ్ `అదృశ్యం’ గురించిన వార్తలు వ్యాపించడం గమనార్హం.