రాజధాని మాలెలో ప్రతిపక్షాల ‘ఇండియా అవుట్’ ర్యాలీపై నిషేధం విధిస్తూ.. మాల్దీవుల పార్లమెంట్ అత్యవసర తీర్మానాన్ని ఆమోదించింది. మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్, ఆయన పార్టీ ప్రొగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్, మిత్ర పక్షం పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్‌లు ఈ ర్యాలీకి పిలుపునిచ్చాయి.
ఈ అత్యవసర తీర్మానాన్ని మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండిపి) సభ్యుడు, మాజీ అధ్యక్షుడు మొహ్మద్ నషీద్ ప్రవేశపెట్టారు. ఈ ర్యాలీ దేశ భద్రతకు ప్రమాదం కలిగిస్తోందని, పొరుగుదేశాల మధ్య విభేదాలను పెంచుతుందని పేర్కొన్నారు. ర్యాలీని, సంబంధిత కార్యక్రమాలను మాల్దీవ్ రక్షణ బృందం అడ్డుకోవాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.
‘ఇండియా అవుట్’ అనేది ఈ ర్యాలీ నేపథ్యం. అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్ నేతృత్వంలోని ఎండిపి ప్రభుత్వ మాల్దీవులను ఇండియాకు విక్రయించిందని రెండేళ్ల క్రితం నిరసనకారులు ఒక ఆందోళన చేపట్టారు.
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ మాల్దీవుల్లో పర్యటిండచంతో నిరసన చేపట్టేందుకు పోలీసులు అనుమతించలేదు. ఇతర ప్రాంతాల నుండి మాలె చేరుకునేందుకు యత్నించిన ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు.
ఐదులక్షల జనాభా కలిగిన అతిచిన్న దేశం మాల్దీవ్స్. 2005లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. హిందూ మహాసముద్రం వ్యూహాత్మక కూడలిగా ఉన్న ఈ దేశం దశాబ్దం కంటే ఎక్కువ కాలంగా భౌగోళిక , రాజకీయ పరిస్థితులతో ప్రభావితమౌతోంది.
గత పదేళ్లుగా మాల్దీవులపై పట్టు సాధించేందుకు చైనా, భారత్‌లు పోటీపడుతున్నాయి. ఇస్లాం ప్రధాన మతంగా ఉన్న ఈ దేశంపై ఇస్లామీయులు కూడా సొంతం చేసుకునేందుకు యత్నించారు. దీంతో ప్రజాస్వామ్యం సాధించుకున్నప్పటికీ ఈ దేశం రాజకీయం ఒడిదుడుకులకు లోనవుతూనే ఉంది.
అత్యంత సన్నిహితంగా, పెద్ద దేశంగా ఉన్న భారత్ అన్ని రంగాల్లోనూ మాల్దీవులకు సహాయం అందిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు అధికారాన్ని గెలుచుకునేందుకు విదేశాంగ విధానం పెద్ద పాత్ర పోషించింది.
మాజీ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ 20వ శతాబ్దం చివరి వరకు దేశంలో ఎదురులేని నేతగా పరిపాలన కొనసాగించారు. మందుగుండు సామగ్రి కోసం శ్రీలంకకు చెందిన తమిళ మిలిటెంట్ గ్రూప్ పిఎల్‌ఒటిను నియమించుకున్న వ్యాపార వేత్త గయూమ్‌కి వ్యతిరేకంగా ప్రణాళికా బద్దంగా చేపట్టిన తిరుగుబాటును భారత్ సహకారంతో జాతీయ భద్రతా దళం అడ్డుకుంది.
ఆ సమయంలో దేశం లోపల, వెలుపల చైనా తన ప్రాభవాన్ని పెంచుకునేందుకు యత్నిస్తూనే ఉంది. దీంతో హిందూ మహాసముద్ర భూభాగంలోని శ్రీలంకపై భారత్, మాల్దీవులపై చైనా ప్రభావంతో రాజకీయ ప్రత్యర్థిగా మారింది.
ఎండిపి పార్టీ, నషీద్‌తో పాటు కీలక నేతలందరూ భారత్‌కు అనుకూలంగా వ్యవహరించగా, యమీన్ చైనాకి అనుకూలంగా వ్యవహరించారు. 2018లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎండిపి అధిక ఓట్లను గెలుచుకుంది. యమీన్ ప్రభుత్వ నేరారోపణల కారణంగా నషీద్ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు.
ఇబ్రహీం సోలీహ్ అధ్యక్షడయ్యాడు. ఆ వెంటనే అవినీతి అరోపణలపై యమీన్‌కు శిక్ష ఖరారైంది. మాలేలో స్నేహపూర్వక ప్రభుత్వం ఏర్పడటంతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను పునర్నిర్మించుకో గలిగింది.
సోలిహ్ ప్రభుత్వ హయాంలో పలు భారత విధానాలను అవలంబించడంతో స్థానికంగా వ్యతిరేకత ఎదురైంది. మరోవైపు న్యూఢిల్లీ నుండి భారీ సైనిక బృందాన్ని మాల్దీవులకు పంపుతుందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ ఆరోపణలను సోలిహ్ ప్రభుత్వం ఖండించింది.
మాల్దీవుల తీర రక్షక దళం ఉతురు తిలాఫల్హు (యుటిఎఫ్) అటాల్ నౌకాశ్రయానిన అభివృద్ధి చేసేందుకు ఇరు పక్షాల మధ్య సహకారంపై దృష్టి సారించింది. నిఘా, సహాయక చర్యల కోసం డోర్నియర్ యుద్ధ విమానాలను వినియోగిస్తున్నామని ప్రకటిస్తోంది.
మాల్దీవుల సుప్రీంకోర్టు అతని నేరారోపణను రద్దు చేసిన అనంతరం సుదీర్ఘ గృహ నిర్బంధం నుండి డిసెంబర్ 2021లో యమీన్ విడుదలయ్యాడు. దీంతో భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. ఈ నిరసనలన్నింటికీ యమీన్ అధ్యక్షత వహించాడు. 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం యమీన్ నిరసనల ద్వారా మద్దతు పెంచుకునేందుకు యత్నిస్తున్నారు. అయితే ఈ నిరసనలను అడ్డుకునేందుకు నౌషద్ తీవ్రంగా యత్నిస్తున్నారు.