స్థానికంగా తయారైన వస్తువులను (లోకల్)ను ‘గ్లోబల్’గా మార్చడానికి మరింత కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.ఎగుమతి లక్ష్యాన్ని అందుకోవడం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం మాత్రమే కాదని దేశ సామర్థ్యానికి చెందిన అంశం కూడా అని, లోకల్ ఫర్ గ్లోబల్‌గా అభివృద్ధి చెందాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాని ఆదివారం తన రేడియో ప్రసంగం 87వ ఎడిషన్ ‘మన్ కీ బాత్’లో మాట్లాడుతూ 400 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని భారత్ చేరుకుందని తెలిపారు. ‘భారతదేశంలో తయారైన వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని, భారతదేశ సరఫరా గొలుసు రోజురోజుకూ బలపడుతోందని చెప్పారు.
ఈ రోజు మనం మిల్లెట్, మామిడి, ప్రసిద్ధ నాగాలాండ్ మిర్చి ఎగుమతి చేస్తున్నాముని తెలిపారు. లడఖ్‌లోని నేరేడు పండు దుబారులో కూడా ప్రజాదరణ పొందిందని, సౌదీ అరేబియాకు తమిళనాడు నుంచి అరటిపళ్లు రవాణా చేస్తున్నామని పేర్కొన్నారు.
‘‘భారత్ సత్తా ఏంటో ఈ ఎగుమతులు నిరూపించాయి. ఇది మనకు గర్వకారణం. మన వస్తువులు మరిన్ని దేశాలకు వెళ్తున్నాయి. మేడిన్ ఇండియా వస్తువులకు గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు మనదేశ ఎగుమతుల విలువ 100 బిలియన్ డాలర్ల వరకు ఉండేది. కొంతకాలం తరువాత 150 బిలియన్ డాలర్లకు, 200 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ 400 బిలియన్ డాలర్లు. చిన్న వ్యాపార సంస్థలు ఎదగడం అందరికీ గర్వకారణం” అని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.
లఢక్ అప్రికాట్, తమిళనాడులో పండే అరటి, హిమాచల్‌లో సాగు చేసే తృణధాన్యాలు, బీజాపూర్ పండ్లు, కూగాయలు, చందోలి బ్లాక్ రైస్‌కు విదేశాల్లో డిమాండ్ ఉందని ప్రధాని చెప్పారు. మేకిన్ ఇండియా వస్తువుల జాబితా చాలా పెద్దదని పేర్కొంటూ మన రైతులు, మాన్యుఫ్యాక్చరర్లు, ఇండస్ట్రీ కష్టం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క భారతీయుడు ‘వోకల్ ఫర్ వోకల్’ (లోకల్ తయారీకి ప్రాధాన్యత ఇవ్వడం)కు మద్దతు ఇస్తే మన మస్తువులకు విలువ మరింత పెరుగుతుందని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి చెందిన జిఇఎం పోర్టల్ ద్వారా లక్ష కోట్ల రూపాయల విలువైన వస్తువులను దేశవ్యాప్తంగా దాదాపు 1.25 లక్షల మంది చిన్న వ్యాపారవేత్తలు, చిన్న దుకాణదారులు నేరుగా ప్రభుత్వానికి విక్రయించారని ప్రధాని చెప్పారు. మహాత్మా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని తల్లిదండ్రులందరూ తమ కుమార్తెలకు విద్యను అందించాలని మోడీ విజ్ఞప్తి చేశారు.