అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ (ఐసిఆర్సి) ”శత్రువు కోసం పనిచేస్తోందని” ఉక్రెయిన్ డిప్యూటీ ప్రధానిఇర్యానా వెరెషుక్ ఆరోపించారు. రష్యా దళాల దిగ్బంధంలో ఉన్న ఓడరేవు నగరమైన మరియుపోల్ నుండి రష్యాకు ప్రజలను తరలించడానికి రెడ్‌క్రాస్ సాయపడిందని ఆమె ఆరోపించారు.
ఉక్రెయిన్ ప్రయోజనాలకు మద్దతివ్వడానికి బదులుగా రష్యా నిధుల పట్ల అంతర్జాతీయ సహాయ సంస్థకు మరింత ఆసక్తి వున్నట్లు కనిపిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. మరియుపోల్ నుండి ప్రజలను రష్యా బలవంతంగా తరలిస్తోందని, అందుకు రెడ్‌క్రాస్ సాయపడిందని ఆమె మండిపడ్డారు.
మరియుపోల్ నుండి రష్యాకు మానవతా కారిడార్‌ను ఉక్రెయిన్ ఎన్నడూ అంగీకరించదని ఆమె స్పష్టం చేశారు. వారు ఆక్రమణదారులు, శత్రువులు, శాంతి పరిరక్షకులు కాదు, అటువంటపుడు అక్కడి వారిని తరలించడంలో సాయపడేందుకు రెడ్క్రాస్కుహక్కులేదని ఉక్రెయిన్ వార్తా సంస్థకుఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తేల్చి చెప్పారు.
అయితే, తాము అటువంటి బలవంత తరలింపుల్లో పాల్గొనలేదని ఐసిఆర్సి పేర్కొంటోంది. ఉక్రెయిన్‌లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా తాము అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనమని చెబుతోంది. ఒక మానవతా సంస్థగా ప్రజలకు సహాయ సహకారాలను అందించడమే లక్ష్యంగా వుంటుంది తప్ప ఘర్షణల్లో ఏదోక పక్షాన్ని చేరబోమని స్పష్టం చేసింది.
సుమీ నగరం నుండి పశ్చిమ దేశాలకు తరలివెళ్లడంలో తాము సాయపడ్డామని గుర్తు చేసింది. అయినా పలు అడ్డంకుల కారణంగా ఉక్రెయిన్ ప్రజలకు సాయమందించడంలో అవాంతరాలు ఏర్పడ్డాయని అంగీకరించింది.