సాగరమాల కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో లక్ష కోట్ల రూపాయల విలువైన 120 ప్రాజెక్ట్‌లను గుర్తించినట్లు రేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ వెల్లడించారు.
విజయసాయి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రాష్ట్రంలో రేవుల చుట్టు పక్కల పారిశ్రామీకరణకు అవసరమైన మౌలిక వసతులను మరింత మెరుగు పరచడం, రేవులను ఆధునికీకరించడం, రేవులకు కనెక్టివిటీని అభివృద్ధి చేయడం, కోస్టల్ షిప్పింగ్, జలరవాణా వ్యవస్థలను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌లను సాగరమాల కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్ట్‌లను వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వేస్, ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర ప్రభుత్వాలు, మేజర్ పోర్ట్‌లు అమలు చేస్తాయని మంత్రి చెప్పారు.
సాగరమాల కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో 1380 కోట్ల రూపాయల విలువైన 12 ప్రాజెక్ట్‌లు చేపట్టడం జరిగింది. అందులో 754 కోట్ల రూపాయల విలువైన 5 ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి. 316 కోట్ల రూపాయల విలువైన 3 ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి.
310 కోట్ల రూపాయల విలువైన 4 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కావలసి ఉందని మంత్రి వివరించారు. దేశ వ్యాప్తంగా 7,500 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాల్లో సాగరమాల కార్యక్రమం కింద 5.5 లక్షల కోట్ల రూపాయలతో 800 ప్రాజెక్ట్‌లను గుర్తించినట్లు ఆయన తెలిపారు.