గత రెండు సంవత్సరాలుగా పైగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు కోట్లాది మంది బలయ్యారు. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కరోనా సోకిన తర్వాత చాలామంది పలు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆరు నెలల తర్వాత కూడా వైరస్ ప్రభావం శరీరంపై ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు.
ముఖ్యంగా శరీరంలో సిరల్లో ప్రవహించే రక్తం గడ్డకడుతుందని బ్రిటీష్ మెడికల్ జర్నల్ (బిఎంజి) అధ్యయనం వెల్లడించింది. అలాగే వైరస్ సోకిన వారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధకులు గుర్తించారు.
ముఖ్యంగా వైరస్ సోకిన కొంతమందిలో మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు కాలి నరాల్లో, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకడుతుందని, ఆ తర్వాత రక్తస్రావమవుతుందని పరిశోధకులు గుర్తించారు. రెండు మూడు దశల్లో కంటే మొదటి దశలో కోవిడ్ బారిన పడిన వారికే అధిక ప్రమాదముందని వారు గుర్తించారు.
అయితే టీకా వేసుకున్న వారికి ప్రమాదం తక్కువగా ఉంటుందని, టీకా అధిక ప్రమాదాల్ని కొంతమేరకు అరికట్టవచ్చని స్వీడన్‌లోని ఉమేయా విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. టీకా తీసుకున్న తర్వాత ప్రమాదస్థాయిని గుర్తించడానికి పరిశోధకులు లక్షలాది మందిని పరీక్షించారు.
మొదటగా పరిశోధకులు కరోనాకు ముందు, ఆ తర్వాత రక్తం గడ్డకట్టే స్థాయిల్ని నోట్ చేశారు. ఫలితాలను చూస్తే కరోనా సోకిన 90 రోజులు, 180 రోజులు ఆ తర్వాత 60 రోజులూ, అంటే మూడుదశల్లోనూ ప్రమాదస్థాయి ఉందనే తెలిపాయి. మొదటి వేవ్ కరోనాబారిన పడిన వారికే ప్రమాదం తీవ్రస్థాయిలో ఉందని వారు కనుగొన్నారు.
ఉదాహరణకు మొదటి వేవ్‌లో కరోనా వైరస్ సోకిన 1200 మందిలో వెయ్యిమందికి పైగా రక్తం గడ్డకడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. మొదటివేవ్లో టీకా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రమాదస్థాయి ఎక్కువగా ఉంది. సెకండ్, థర్డ్వేవ్ల్లో టీకా అందుబాటులోకి రావడం.. ప్రజలకు టీకా వేయడం వల్ల ప్రమాదస్థాయి తగ్గిందని పరిశోధనలో తేలింది. తేలికపాటి లక్షణాలుండి, ఆసుపత్రిలో చేరని వారికి కూడా రక్తం గడ్డకట్టేస్థాయి ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు.