ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షతో ఢిల్లీ దద్దరిల్లింది. సంవత్సరం పాటు సాగు చట్టాలకు నిరసనగా ఢిల్లీ శివారులలో జరిపిన నిరసనల అనంతరం అక్కడ జరిగిన అతిపెద్ద రైతుల నిరసన అని చెప్పవచ్చు.
రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఒకటే చెబుతున్నా ఎవరితోనైనా పెట్టుకోండి కానీ రైతులతో కాదని ఆయన హెచ్చరించారు.
కేసీఆర్ కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్ విధించారు. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని రైతులు భిక్షగాళ్లు కాదు.. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి వస్తారని కెసిఆర్ హెచ్చరించారు.
బోర్ల దగ్గర మీటర్లు పెట్టాలని షరతు పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై ఇడి, ఐటి అంటూ బెదిరిస్తారా? చురకలంటించారు.
బిజెపిలో అందరూ సత్యహరిశ్చందులే ఉన్నారా? అంటూ చోటామోటా నేతలు కూడా సిఎంను జైళ్లో వేస్తామంటున్నారని, తనని జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని, దమ్ముంటే తనని జైలుకు పంపించాలని కేసీఆర్ సవాల్ విసిరారు. ప్రధాని నరేంద్ర మోదీకి చేతులు జోడించి చెబుతున్నానని, రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని కోరుతున్నానని చెప్పారు.
హిట్లర్, నెపోలియన్ వంటి వారు కాలగర్భంలో కలిసిపోయారని గుర్తు చేశారు. ఎవరూ శాశ్వతం కాదని, ఎందుకీ అహంకారం అని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తేనే మోదీకి రైతులు గుర్తుకొస్తారని ఆయన ఎద్దేవా చేశారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రైతులను రెచ్చగొట్టారని మండిపడ్డారు. ధాన్యం ఖరీదుతో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సంబంధం లేదన్నవారే, ఇప్పుడు సిగ్గులేకుండా హైదరాబాద్‌లో ఎలా ధర్నా చేస్తున్నారని కేసీఆర్ నిలదీశారు.
భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ మాట్లాడుతూ కనీస మద్దతు ధర చట్టబద్ధత కావాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలతో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి లేఖలు రాశారని చెబుతూ రైతులు, కార్మికుల గురించి మాట్లాడ్డం తప్పా అని ఆయన ప్రశ్నించారు.
దేశ రైతులు తమ హక్కు కోసమే పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. దేశంలో రైతులు మరో పెద్ద ఆందోళన చేపట్టాల్సిన అవసరముందని ఆయన పిలుపిచ్చారు. వరి ధాన్యం, గింజలు తీసుకొచ్చిన రైతులు తమ పంటకు ధర కావాలని కోరుతున్నారని చెబుతూ రైతులకు మద్ధతుగా సంయుక్త్ కిసాన్ మోర్చా నిలబడుతుందని స్పష్టం చేశారు. విద్యుత్తు చట్టం (సవరణ)ను వ్యతిరేకిస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు.
తెలంగాణలో రైతులకు విద్యుత్తు ఉచితంగా ఇస్తున్నారని చెబుతూ దేశమంతటా ఇది ఎందుకు సాధ్యం కాదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బందును దేశవ్యాప్తంగా అమలు కావాలని టికాయత్ డిమాండ్ చేశారు.
కేంద్రం ఇచ్చే రూ. 6 వేలు రైతులందరికీ అందడం లేదని ఆరోపించారు. రైతులకు నేరుగా సబ్సిడీ అందించకపోతే, రైతులు జీవించలేరని ఆయన చెప్పారు. పదేళ్ల పాత వాహనాలు ఇక్కడ నడపడానికి వీల్లేదు అంటున్నారని చెబుతూ పదేళ్ల పాత ట్రాక్టర్‌ను నడుపుకోకపోతే రైతులు ఎలా వ్యవసాయం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు.
4 లక్షల పాత ట్రాక్టర్లతో ఢిల్లీ వీధుల్లో ఆందోళన చేశామని టికాయత్ గుర్తు చేశారు. అన్ని పార్టీలు కలసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో కెప్టెన్ ఎవరన్న ప్రశ్న లేవనెత్తుతున్నారని, ముందు పోరాటమనేది మొదలుపెడితే, అందరూ కెప్టెన్లేనని స్పష్టం చేశారు.
వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రసంగీస్తూ కేంద్ర మంత్రితో చర్చలకు వెళ్తే అవమానించేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ ప్రజలకు నూకల బియ్యం పెట్టండంటూ అవహేళన చేశారని వాపోయారు. రైతుల విషయంలో వ్యాపార దృక్పథంతో ఆలోచించకూడదని హెచ్చరించారు.
చెమటోడ్చి కష్టపడ్డ తెలంగాణ రైతులు పంజాబ్‌ను తలదన్నేలా పంట దిగుబడి సాధించడం గర్వించాల్సిన విషయమని చెప్పారు. కేవలం కొనే విషయంలోనే బాధ్యత కల్గిన కేంద్రం, ఆ పని చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు.
చెమటోడ్చి కష్టపడడమే కాదు, కేంద్రానికి చెమటలు పట్టించడం కూడా రైతులకు తెలుసునని ఆయన హెచ్చరించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో చెంపలేసుకుని, రైతుల క్షమాపణ కోరిన నీతిమాలిన సర్కారు బీజేపీదని ఎద్దేవా చేశారు. కనీస మద్ధతు ధర కోరుతూ నాడు సీఎంగా మోదీ కేంద్రానికి పంపిన ఫైలు, ఇప్పటికీ ప్రధాని టేబుల్ దగ్గరే పెండింగులో ఉందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో కేసీఆర్ బ్యానర్‌ను వేదిక మీద ఏర్పాటు చేశారు. వేదిక ముందు భాగంలో ప్రదర్శన కోసం వడ్లు పోశారు. తెలంగాణ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వివిధ జిల్లాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నిరసన దీక్ష వేదిక కింద మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, పద్మా దేవేందర్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, సత్యవతి రాథోడ్ ప్రజాప్రతినిధులతో కలిసి కూర్చున్నారు. వడ్ల కంకులు, ప్లకార్డులు పట్టుకుని వాటిని ప్రదర్శించారు. కేసీఆర్ కటౌట్లు, ప్లకార్డులు పట్టుకుని కేంద్రం తీరుపై కార్యకర్తలు నినాదాలు చేశారు