కేంద్రంలో పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని మండి పడుతూ తెలంగాణాలో ప్రతి గింజను తామే కొటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ కేంద్రం పంట కొనడం చేతకాక తెలివి తక్కువ మెలికలు పెడుతుందని ధ్వజమెత్తారు. వ్యవసాయాన్ని కార్పోరేట్లకు అప్పగించాలని కేంద్రం కుట్ర చేస్తుందని ఆరోపించారు.
యాసంగిలో పండిన వడ్లు కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కెసిఆర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మే 20 నుంచి జూన్ 5 వరకు మరోసారి ఉద్ధృతంగా పల్లెప్రగతి, పట్టణప్రగతి నిర్వహిస్తామని పేర్కొన్నారు.మద్దతు ధర ప్రకారం క్వింటాల్ ధాన్యానికి రూ.1,960 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.
ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని ఆయన రైతులను కోరారు. ధాన్యం డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. మూడు, నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తామని చెప్పారు.
బుధవారం నుంచే యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేస్తామని వెల్లడించారు. ధాన్యం డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. యాసంగి ధాన్యంలో వచ్చే 37 శాతం నష్టం కేంద్రమే భరించాలని, అది చేయకుండా కేంద్రం రాద్ధాంతం చేస్తుందని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. మోరీల్లాగా నోరులు పెట్టుకుని పెడ బొబ్బలు పెడుతున్నారని విమర్శించారు.
ధాన్యం కొనటం చేతకాదని కేంద్రం నేరుగా చెప్పొచ్చు కదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. బాయిల్ రైసు ఎగుమతి చేస్తూ చేయట్లేదని అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. యాసంగి వడ్లలో నూకల శాతం పెరుగుతుందని చెప్పారు. సాధారణంగా వర్షాకాలంలో క్వింటాల్ వడ్లకు 67 కిలోల బియ్యం వస్తాయి, అదే యాసంగిలో 35 కిలోలు మాత్రమే వస్తాయని వివరించారు.
యాసంగి ధాన్యం మిల్లింగ్ చేస్తే క్వింటాల్‌కు 67 కిలోల బియ్యం రాదని, యాసంగిలోనూ క్వింటాల్‌కు 67 కిలోల బియ్యం ఇవ్వాలంటే కుదరదని చెప్పారు. క్వింటాల్ వడ్లకు 34 కిలోల బియ్యమే వస్తుందని వివరించారు. 30 కిలోల తేడాను భరించేందుకు కేంద్రం ఒప్పుకోవట్లేదని అన్నారు. భారతదేశం ఆహార భద్రతను కేంద్రానికి అప్పగించింది.
కాబట్టి ఆ నష్టాన్ని కేంద్రం భరించాలని స్పష్టం చేశారు. అందుకే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశారని, గిడ్డంగుల సామర్థ్యం ఎఫ్‌సిఐకే ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆహర భద్రత బాధ్యతను విస్మరించిందని అన్నారు. ధాన్యం కొనడానికి కేంద్రం వద్ద డబ్బులు లేవా?.. ప్రధాని మోదీకి మనసు లేదా..? అని ప్రశ్నించారు.
ఎరువుల ధరలు విపరీతంగా పెంచారని చెబుతూ తెలంగాణకు ఉన్న స్థాయి కేంద్రానికి లేదని విమర్శించారు. రైతులను అవమాన పరిచి చివరకు చట్టాలను వెనక్కు తీసుకున్నారని, కేంద్ర అసమర్ధతను ఇతరులపై నెట్టేస్తుందని ఎద్దేవా చేశారు. కొనుగోళ్లపై కేంద్రం పిచ్చిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.