నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీకి బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గత రాత్రి 11 గంటల సమయంలో ఫ్యాక్టరీ ఆవరణలోని యూనిట్ 4 లో భారీ శబ్దంతో మంటలు చెలరేగి ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. పలువురు గాయపడ్డారు.
ఈ ఘటనపై గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు రూ. 25 లక్షల చొ ప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలను సిఎం పరిహారంగా ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయవల్సిందిగా జిల్లా కలెక్టర్ ను, ఎస్పీని ఆదేశించారు.
40 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఫ్యాక్టరీలో 150 మంది షిఫ్ట్ డ్యూటీ లో ఉన్నట్ల్లు సమాచారం. అయితే ప్రమాదం జరిగిన బ్లాక్ లో 30 మంది పని చేస్తున్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని నూజివీడు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి, విజయవాడ ప్రభుత్వాసుప్రతికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్, రెవెన్యూ, ఫైర్ అధికారులు,సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ అనిల్ తో రాహుల్ దేవ్ శర్మ ..ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా టెంపరేచర్ ఎక్కువై రియాక్టర్ పేలిందా లేక షార్ట్ సర్క్యూట్ ఆ అని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మృతులు యు.కృష్ణయ్య (34), బి. కిరణ్ కుమార్ (42), రవిదాస్(40), మనోజ్ కుమార్ (25), సువాస్ రవి (32), హబ్దాస్ రవి (27)గా గుర్తించారు. చివర పేర్కొన్న నలుగురు మృతులు బీహార్ చెందిన వారుగా తెలిపారు. క్షతగాత్రుల్లో పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించినట్లు అధికారులు తెలిపారు.
ప్లాంట్ ఇంచార్జ్ శుక్ల కూడా లోపలే ఉన్నట్లు, ఆయన కూడా మరణించి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వైద్యాధికారులనూ సూచించారు. మొత్తం మూడు ఫైర్ ఇంజన్లతో రాత్రి 11 గంటల నుండి నేడు ఉదయం వరకు మంటలు ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు.
ఈ ఘటనపై విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. విజయవాడ ఆస్పత్రిలో 12 మందిని తీసుకువస్తుండగా, మార్గమధ్యలో ఒకరు మృతి చెందారని తెలిపారు. 70 శాతానికి పైగా బాధితులకు గాయాలయ్యాయని, వీరికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.