ఢిల్లీలోని జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా శనివారం చెలరేగిన హింసాకాండకు ఇటీవల రాజస్థాన్‌లోని కరౌలీ, మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో జరిగిన మత ఘర్షణలకు ఏమైనా సంబంధం ఉందా? అని కేంద్ర దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి.
దేశంలోని మత సామరస్యానికి భంగం కలిగించే పెద్ద కుట్రను సూచిస్తూ ఈ ఘటనలన్నింటి స్వరూపం ఒకే విధంగా ఉందని ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఈ రాష్ట్రాల్లో మతపరమైన ఊరేగింపులపై దాడులు హిందూ, ముస్లిం వర్గాలు చాలా కాలంగా కలసి నివసిస్తున్న ప్రదేశాలలో ఈ ఘర్షణలు జరగడం గమనిస్తే భద్రతలోపం కూడా వెల్లడవుతోంది.
కరౌలిలో, ఏప్రిల్ 2న హిందూ నూతన సంవత్సర మొదటి రోజు నవ్ సంవత్సర్ సందర్భంగా జరిగిన ఊరేగింపుపై రాళ్లు రువ్వడంతో హింస చెలరేగింది. ఈ ఘర్షణల్లో 42 మందికి పైగా గాయపడ్డారు. ఖర్గోన్లో, శ్రీ రామ నవమి సందర్భంగా మతపరమైన ఊరేగింపు తలాబ్ చౌక్ ప్రాంతం గుండా వెళుతుండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువైపులా రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు.
ఇక, ఢిల్లీలోని జహంగీర్‌పురిలో శనివారం మధ్యాహ్నం హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా హింస చెలరేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రెండు వర్గాల మధ్య ఘర్షణల సమయంలో రాళ్లదాడి, దహనం జరిగింది, ఎనిమిది మంది పోలీసు సిబ్బంది, స్థానికుడు ఒకరు గాయపడ్డారు. కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులు లక్ష్యంగా ఇక్కడ దాడులు జరగడం గమనార్హం.
ఘర్షణల వెనుక ఉన్న “ప్రధాన కుట్రదారులలో” ఒకరైనా సబ్-ఇన్స్పెక్టర్కు తగిలిన బుల్లెట్‌ను కాల్చిన మరొక వ్యక్తితో సహా 14 మందిని అరెస్టు చేశారు. జహంగీర్‌పురిలోని సిడి పార్క్‌లోని స్లమ్ క్లస్టర్లో నివసిస్తున్న ఎండీ అస్లాం (21) నుండి శనివారం సాయంత్రం నేరం జరిగినప్పుడు ఉపయోగించిన పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 2020లో జరిగిన నిరసనల సందర్భంగా జహంగీర్‌పురి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కూడా అస్లాం ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. దేశ రాజధానిలోని మిగిలిన 14 పోలీసు జిల్లాల్లో మొత్తం భద్రతా ఏర్పాట్లను పెంచామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాంకేతిక నిఘా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
శనివారం నాటి సంఘటన జరిగిన వెంటనే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాకేష్ అస్థానా, ప్రత్యేక కమిషనర్ (లా అండ్ ఆర్డర్) దేపేంద్ర పాఠక్‌లతో హింసపై మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది.
జహంగీర్పూరిలో జరిగిన ఘర్షణ కేసుకు సంబంధించి 20 మంది అనుమానితులను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ ప్రత్యేక పోలీస్ కమిషనర్ దేపేంద్ర పాఠక్ తెలిపారు. అయితే అరెస్ట్ చేసిన వారిలో ఇద్దరు మైనర్లు ఉండడంతో వారిని జూవైనల్ హౌస్‌కు పంపినట్లు ఆదివారం ఆయన తెలిపారు.
అలాగే మూడు దేశీయ తుపాకులు, ఐదు తల్వార్లు సీజ్ చేసినట్లు వారు తెలిపారు. అరెస్ట్ చేసిన అనంతరమే వారిని ఢిల్లీలోని రోహిణి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఘర్షణ జరిగిన ప్రాంతంలో పరిస్థితి పూర్తి నియంత్రణలోనే ఉందని పోలీసులు తెలిపారు. తగిన స్థాయిలో పోలీసు బలగాలను మోహరించినట్టు చెప్పారు.
కాగా, జహంగీర్‌పురి ఘర్షణ అంతర్జాతీయ కుట్రలో భాగమని బీజేపీ నేత, వాయువ్య ఢిల్లీ ఎంపీ హన్స్ రాజ్ హన్స్ ఆరోపించారు. భారత్‌ను అప్రతిష్ఠపాలు చేయడమే విదేశీ శక్తుల లక్ష్యమని అన్నారు. దేశంలో నివసిస్తున్న కొంతమంది వ్యక్తులు విదేశీ శక్తులకు సాయమందిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ‘ఇది ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్ర. భారత్‌ను అపకీర్తిపాలుచేయడమే వారి లక్ష్యం. ఈ ఘటన విషయంలో ఏ మతాన్నీ నిందించలేం. ఈ ఘటనపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలి’ అని డిమాండ్ చేశారు.