దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలెత్తుతున్న మత ఘర్షణలు, కల్లోలంల గురించి వార్తలు, కథనాలను నివేదించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, అత్యున్నత స్థాయిలో వృత్తిపరమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, సంయమనంతో వ్యవహరించాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ( ఇజిఐ) సంపాదకులను, పాత్రికేయులనూ కోరింది.
జర్నలిజంలో అనేక ఆదర్శప్రాయమైన లక్ష్యాలు, వృత్తిపరమైన విధులు, కర్తవ్యాలు వుంటాయని, సామాజిక శాంతిని పరిరక్షింస్తూనే, మత సామరస్యతను కాపాడుతునే విధులు నిర్వర్తించాల్సి వుంటుందని పేర్కొంది. అంతేకానీ పుకార్లను వ్యాప్తి చేయరాదని, పక్షపాతంతో వ్యవహరించరాదని గిల్డ్ స్పష్టం చేసింది.
‘ఘర్షణలు చెలరేగిన పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి వార్తలు సేకరించే విలేకర్లు ఎదుర్కొనే ఇబ్బందులు, కష్ట నష్టాల గురించి ఎడిటర్స్ గిల్డ్‌కు తెలుసు. అయితే ‘రెండు మతాలల మధ్య ఘర్షణలకు సంబంధించి వార్తలు ఇచ్చేటపుడు ఆ కథనాల ప్రజంటేషన్లో కొద్దిపాటి బాధ్యత, శ్రద్ధ తీసుకోవాల్సి వుంటుంది’ అని సూచించింది.
ప్రత్యేకించి ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియాలో ఇది చాలా అవసరం అని స్పష్టం చేసింది. వార్తలను అందరికన్నా ముందుగా ఇవ్వాలనే ఆకాంక్ష అర్థం చేసుకోదగ్గదే. వెంటనే ఈ వార్తను పాఠకులను ఆకర్షించేలా ఇవ్వాలనుకోవడం సమర్థనీయమే అని పేర్కొంది.
అయితే, చాలామంది సంపాదకులు, విలేకర్లు పూర్తిగా వాస్తవాలను తెలుసుకోకుండానే, సందర్భాన్ని, అక్కడ వున్న పరిస్థితులను గ్రహించకుండానే ఏదో ఒక మతంకు అక్కడ జరిగిన సంఘటనల తాలుకూ బాధ్యతలను, తప్పొపులను ఆపాదించేయడానికి తొందరపడుతున్నట్లు కనిపిస్తోందని అని ఎడిటర్స్ గిల్డ్ ఆందోళన వ్యక్తం చేసింది.
‘ఇది, విపరీత పర్యవసానాలకు దారి తీయవచ్చు. చాలా సంఘటనల్లో పైకి చూడగానే విషయాలు తెలిసిపోయేలా వుండడం అరుదుగా వుంటుంది. రాజకీయ నేతలు, పోలీసులు, అధికారులు, ప్రభుత్వేతర శక్తుల పాత్ర స్పష్టంగా తెలుసుకోవాల్సి వుంటుంది’ అని హెచ్చరించింది.
అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో సంపాదకులు తమ అనుభవాలను, దృక్పధాన్ని ఉపయోగించి వ్యవహరించాల్సి వుందని హితవు చెప్పింది. పారదర్శకత, తటస్థత, సమతూకం- ఈ మూడు గుణాలను పాటించేందుకు ప్రతి ఒక్క జర్నలిస్టు అదనపు కృషి చేయాల్సి వుంటుందని గిల్డ్ స్పష్టం చేసింది.