గల్వాన్ ఘటనలో భారత బలగాల నుంచి చైనా తీవ్ర ప్రతిఘటన చవిచూసిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోలేదు. ఉద్రిక్తతలను సడలించేందుకు బలగాలను ఉపసంహరించుకునే దిశగా పలు దఫాలుగా ఉభయ పక్షాలు చర్చలు జరిగినప్పటికీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) సమీపంలో రెచ్చగొట్టే చర్యలను బీజింగ్ కొనసాగిస్తూనే ఉంది.
ఈ క్రమంలోనే తాజాగా చైనా మరో రెచ్చగొట్టే చర్యకు దిగినట్టు తెలుస్తున్నది. లద్దాఖ్‌లోని ఎల్ఏసీ సమీపంలో 3 కొత్త మొబైల్ టవర్లను చైనా ఏర్పాటు చేసినట్టు వార్తలు వెలుగుచూశాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు సమీపంలో కూడా చైనా గతంలో ఇలాంటి ఎత్తుగడే అమలు చేసింది. తాత్కాలిక గ్రామాలు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో లద్దాఖ్‌లో ఏదైనా దుశ్చర్యకు పాల్పడే యోచనలో చైనా ఉందా అనేది తాజా చర్చనీయాంశమవుతోంది.
భారత్ వైపు ఉన్న లద్దాఖ్‌లోని ప్రాంతాలను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందంటూ ఇటీవల ఒక వార్తపత్రిక కథనం ప్రచురించింది. పచ్చిక బయళ్లను మేసేందుకు వెళ్లిన పశువులను గొర్రెలకాపరులు వెనక్కి తీసుకు వస్తుండగా వారికి చైనా ఏర్పాటు చేసిన మొబైల్ టవర్లు కంటబడ్డాయి.
ఈ నేపథ్యంలో భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు ప్రాంతాల్లో సునాయసంగా చొచ్చుకుపోయే ఆలోచనతోనే చైనా ఈ దుందుడుకు చర్యకు ఒడిగడుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో చైనా మొబైల్ టవర్లు ఏర్పాటు చేయడం వెనుక సరిహద్దు ప్రాంతాల్లో భారత్ పట్టును బలహీన పరచే ఉద్దేశం కనబడుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అలాంటిదేమీ లేదనకుంటే, భద్రతా సంస్థలు దీనిపై తక్షణం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద మూడు మొబైల్ టవర్లను చైనా నిర్మించినట్టు స్థానిక కౌన్సిలర్ స్టాంజిన్ తెలిపారు.
”పాంగాంగ్ సరస్సుపై బ్రిడ్జి పూర్తి చేసిన చైనా ఇప్పుడు భారత భూభాగానికి అతి సమీపంలోని చైనా హాట్ స్ప్రింగ్ వద్ద 3 మొబైల్ టవర్లు ఏర్పాటు చేసింది. ఇది ఆందోళ కలిగించే విషయం కాదా?. మేము ఉంటున్న జనావాసాలకు కనీసం 4జీ సౌకర్యం కూడా లేదు. నా నియోజకవర్గంలోనే 11 గ్రామాలకు 4జీ సౌకర్యం లేదు” అని ఛుషుల్ కౌన్సిలర్ స్టాన్జిన్ తెలిపారు.
గత జనవరిలో తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సుపై చైనా అక్రమంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలిపింది. ఇలాంటి చట్టవిరుద్ధ ఆక్రమణలకు భారత్ ఎప్పటికీ అంగీకరించే ప్రసక్తే లేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెగేసి చెప్పారు.
ప్యాంగాంగ్ సరస్సు ఉ్తతర, దక్షిణ ప్రాంతాలను అనుసంధానిస్తున్న ఈ బ్రిడ్జితో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రెండు వైపుల నుంచి అత్యంత వేగంగా దూసుకువచ్చేందుకు వీలుకలుగుతుంది. భారత్-చైనా మధ్య ఇప్పటికే గత రెండేళ్లుగా సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి.
చైనా తమ ‘న్యూ బోర్డర్ లా’ ప్రకారం తూర్పు ప్రాంతంలోని సరిహద్దు ప్రాంతాల్లో ‘డ్యూయల్-యూజ్’ గ్రామాలను నిర్మించింది. ఇవి భారత్‌కు ముప్పగానే చెప్పవచ్చు. ఎందుకుంటే వీటిని శాశ్వత మిలటరీ స్థావరాలుగా మార్చుకునే అవకాశం ఉంది.
అరుణాచల్ తరహాలోనే చైనా ఇప్పుడు లద్దాఖ్‌లోనూ తన నెట్వర్క్ విస్తరించుకుంటోందనే అభిప్రాయాన్ని తోసిపుచ్చలేమని తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. . లద్దాఖ్ గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ మొబైల్ టవర్లను బీజింగ్ ఉపయోగించుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు.