ఉక్రెయిన్ పై దాటి ప్రారంభించిన సుమారు రెండు నెలలు అవుతుండగా రష్యా సేనలు కీలక పారిశ్రామిక నగరమైన మేరియుపోల్ తమ వశమైయిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. మేరియుపోల్ విమోచన కోసం చేపట్టిన సైనిక చర్య విజయవంతం కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
అందుకోసం పోరాడిన రష్యా సేనలను ఆయన అభినందించారు. ఇక ఆ ప్రాంతంపై దాడులు చేయాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. అప్పటి నుంచి మేరియుపోల్ పై తీవ్ర స్థాయిలో దాడులు చేస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.
అజోవ్ సముద్రంలోని మారియుపోల్‌పై పూర్తి నియంత్రణ సాధించడం రష్యాకు ప్రధాన వ్యూహాత్మక విజయం. ఇది తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటువాదుల భూభాగాలకు విలీనమైన ‘క్రిమియా’ను అనుసంధానించడంలో సహాయపడుతుంది. రష్యా ఆక్రమించిన క్రిమియాకు, రష్యా స్వతంత్ర ప్రాంతంగా గుర్తించిన డాన్ బాస్ కు మధ్యలో మేరియుపోల్ ఉంది.
ఇప్పడు మేరియుపోల్ రష్యా వశం కావడంతో క్రిమియా, డాన్ బాస్ మధ్య భూ మార్గంలో రాకపోకలకు రష్యాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న క్రిమియాతో పాటు ఇటీవల వశపరుచుకున్న ఉక్రెయిన్ భూభాగాలను కలిపి భూమార్గంలో బ్రిడ్జిని నిర్మించాలనుకున్న రష్యాకు మరియుపోల్ ప్రాంతం కీలకంగా మారింది.
అలాగే అక్కడి అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంట్‌పై దాడికి బదులు స్వాధీన పర్చుకోవాలని సైన్యానికి రష్యా సూచించింది. ఆ స్టీల్ ప్లాంట్‌లో అనేక మంది సైనికులు ఉండే అవకాశముందన్న రక్షణ శాఖ మంత్రి సెర్గీ పొయుగు అనుమానం మేరకు రష్యా ఈ చర్యకు ఉపక్రమించింది.