కృష్ణా జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. గుడివాడ మండలంలోని మోటూరు గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై మైనింగ్ మాఫియా దాడికి దిగింది. గుడివాడ మండలం మోటూరు గ్రామంలో గత కొన్ని రోజులుగా రాత్రి పూట జరుగుతున్న మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు.
తవ్వకాలను అడ్డుకున్నారనే కోపంతో ఆర్ఐపై ఇసుకాసురులు దాడికి పాల్పడ్డారు. మోటూరు గ్రామంలోని కాలువల వెంట మట్టి తవ్వకాలు జరుగుతుండగా తన సిబ్బందితో కలిసి ఆర్ఐ అరవింద్ అడ్డుకున్నారు. దీంతో మట్టి మాఫియా ఆయనపై దాడి చేశారు. ఆర్ఐ మొహంపై పిడిగుద్దులు కురిపించారు. ఆర్ఐని చంపేస్తామంటూ మట్టిమాఫియా హెచ్చరించింది.
గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై గతంలోనే దాడులు నిర్వహించి అక్రమ తవ్వకాలను నిలుపుదల చేసినట్లు ఆర్ఐ అరవింద్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు తిరిగి ప్రారంభమైన తవ్వకాలను అడ్డుకున్న తనపై మట్టి మాఫియా దాడి చేసినట్లు పేర్కొన్నారు. తన చొక్కా పట్టుకుని.. మెడలోని చైన్ పట్టుకుని లాగారని చెప్పారు.
విషయం తెలుసుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్ఐపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ఐపై దాడి చేసిన పది మందిని గుడివాడ రూరల్ మండల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, మోటూరు గ్రామంలో వైసీపీ నేతలు అక్రమ తవ్వకాలు చేస్తున్న ప్రాంతాన్ని టీడీపీ నాయకులు పరిశీలించారు. వైసీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న గుడివాడ ఆర్ఐ అరవింద్‌పై వైసీపీ నేతల దాడులను ఖండించారు.
వ్యవస్థలను నాశనం చేసేలా అధికారులపై వైసీపీ శ్రేణుల దాడులు అమానుషమని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు గుడివాడలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గత నెల రోజులుగా నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు చేసినా.. స్పందన లేదని విమర్శించారు.
రెవెన్యూ అధికారిపై హత్యాయత్నం చేసిన వైసీపీ నేతలపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలని రావి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఇలా ఉండగా, అనుమతులు లేకుండా తన పొలంలో మట్టి తవ్వకాలు చేస్తున్నారని, ఇదేమిటని అడిగిన తనపై అధికార పార్టీ నేతలు దాడులకు దిగుతున్నారని భూ యజమాని సులోచనరావు తెలిపారు.