కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రెండు రోజుల పాటు జరుప దలచిన తెలంగాణ పర్యటనలో భాగంగా మే 7న ఉస్మానియా యూనివర్సిటీలో తలపెట్టిన రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శన వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది.
రాహుల్ సభకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ అనుమతి నిరాకరించడంతో ఒక వంక నిరసనలు, మరోవంక హైకోర్టు కు వివాదం చేరింది. రాహుల్ సభ కోసం విద్యార్థి సంఘాల నుంచి అందిన వినతిపత్రానికి సంబంధించి యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన మీదట వీసీ శనివారం అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం ప్రకటించారు.
ఓయూలో సభలు సమావేశాలు, రాజకీయ సమ్మేళనాలకు అనుమతులు ఇవ్వకూడదని గతంలోనే నిర్ణయం తీసుకున్నామని వైస్ ఛాన్సలర్ తెలిపారు. పైగా, ఎటువంటి రాజకీయ సభలకు అనుమతి ఇవ్వడం లేదని కూడా స్పష్టం చేశారు. దానితో రాహుల్ సభకు అనుమతి నిరాకరించడం ఓయూలో ఉద్రిక్తతకు దారితీసింది.
వీసీని కలిసిన విద్యార్థి సంఘాల నాయకులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆర్ట్స్ కళాశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
మరోవంక, రాహుల్ సభకు అనుమతి కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ ఓయూ జేఏసీ వేసింది. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఓయూ వైస్ చాన్సలర్, ఓయూ రిజిస్ట్రార్ లను ప్రతివాదులుగా చేర్చింది. పిటిషన్ పై సోమవారం వాదనలు జరగనున్నాయి. విద్యార్థులు, నిరుద్యోలతో రాహుల్ గాంధీ ఇంటరాక్ట్ అవుతారని కోర్టుకు తెలిపారు.
పైగా, ఈ సభలో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు ఉండబోవని, శాంతిభద్రతల సమస్య వచ్చే అవకాశమే లేదని కోర్టుకు వివరించారు. అధికార పార్టీ ఒత్తిడి వల్లే సభకు అనుమతి ఇవ్వడం లేదని కోర్టుకు పిటిషనర్లు తెలిపారు. ఠాగూర్ ఆడిటోరియంలో సభకు అనుమతిఇచ్చేలా వీసీని ఆదేశించాలని కోర్టును కోరారు.
ఇలా ఉండగా, రాహుల్ సభకు అనుమతి ఇవ్వనందుకు నిరసనగా విద్యార్థి సంఘాల నేతలు, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో మంత్రుల క్యార్టర్స్, ఓయూ అడ్మినిస్ట్రేషన్ భవన్ ముట్టడికి ఆదివారం యత్నించారు. మంత్రుల నివాస సముదాయం వైపు దూసుకురావడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది.
అదే సమయంలో ఓయూలో కూడా అడ్మిన్స్టేషన్ భవన్ ముందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం, పరిపాలన భవనం అద్దాలు ధ్వంసం చేయడంతో హీట్ ఇంకాస్త పెరిగింది. ఎన్ఎస్యూ వెంకట్ ఆధ్వర్యంలో ఓయూ వీసీకి గాజులు, చీరలు పంపుతున్నామని వాటిని భవనం ముందు పెట్టారు.
నెల 7న ఓయూలోని విద్యార్థులతో రాహుల్ భేటీకి అనుమతి ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్ బేషరత్‌గా క్షమాపణలు చెప్పాలని, లేదంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు విద్యార్థి నేతలను అడ్డుకోగా.. ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
భారీగా పోలీసులు వచ్చి విద్యార్థి సంఘం నాయకులు మానవతరాయ్, దయాకర్ తదితరులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల అరెస్టు అంశాన్ని తెలుసుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. అరెస్టయిన విద్యార్థులను పరామర్శించారు.
అదే సమయంలో ఓయూలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో వీసీ కార్యాలయం ముట్టడికి యత్నించిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి బంజారాహిల్స్ పీఎస్ నుంచి బయటికి వస్తుండగా.. జగారెడ్డిని పీఎస్‌లో అరెస్టు చేసి నిర్భందం చేశారు.
జగ్గారెడ్డి అరెస్టును కాంగ్రెస్ నేతలు ఖండించడంతో పాటు మాజీ మంత్రి గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ తదితరులు బంజారాహిల్స్ పీఎస్‌కు వెళ్లి జగ్గారెడ్డిని పరామర్శించారు.
రాహుల్ గాంధీ ఓయూకు వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భయమెందుకని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ పర్యటన కోసం జగ్గారెడ్డి యూనివర్సిటీ వీసీని అనుమతి కోరారని చెప్పారు. ఆదివారం జగ్గారెడ్డి ఓయూకు వస్తే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు.
పిసిసి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6న సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. శంషాబాద్ నుంచి హెలికాప్టర్లో వరంగల్ వెళ్లి, అక్కడ లో పాల్గొంతయారు. సంఘర్షణ సభ ప్రాంగణంలో 2 వేదికలు ఏర్పాటు చేయనున్నారు. రాహుల్, ముఖ్య నేతలకు ఒక వేదిక…రైతు ఆత్మహత్యల కుటుంబాలకు మరో వేదిక ఉండనుంది.
సభ తర్వాత రాహుల్‌గాంధీ రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు చేరుకుని దుర్గం చెరువు పక్కన ఉన్న కోహినూర్ హోటల్లో బస చేయనున్నారు.7న ఉదయం ముఖ్యనేతలతో రాహుల్ అల్పాహార విందు, అనంతరం సంజీవయ్య పార్క్‌లో మాజీ సీఎం సంజీవయ్య 50వ వర్ధంతి సందర్భంగా రాహుల్ నివాళులర్పించనున్నారు.
తర్వాత గాంధీభవన్‌లో 200 మంది ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. డిజిటల్ మెంబర్షిప్ ఎన్రోలెర్స్తో ఫొటో సెషన్లో పాల్గొననున్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో రాహుల్ లంచ్ మీటింగ్‌లో రాహుల్ పాల్గొంటారు. 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాహుల్ తిరిగి ఢిల్లీకి రాహుల్ వెళ్లనున్నారు.