ఒక వంక 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రువర్గంలో, ప్రభుత్వ యంత్రాంగంలో, పార్టీ వ్యవస్థలో కీలక మార్పులు చేసి, `ఇంటింటికి ఎమ్యెల్యేలు’ కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల వద్దకు వెడుతుండగా, ప్రధాన ప్రతిపక్షం టిడిపి కూడా సమాయత్తం అవుతున్నది.
ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతూ, పార్టీ యంత్రాంగాన్ని స్థానికంగా క్రియాశీలం చేసే ప్రయత్నం చేస్తున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు జిల్లాల పర్యటనలు చేపట్టారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఎక్కువగా హైదరాబాద్, అమరావతిలకు పరిమితమై ఉంటూ, చాలా అరుదుగా
రాష్ట్రంలో పర్యటిస్తూ వస్తున్న ఆయన విస్తృతంగా జిల్లాల పర్యటన చేపట్టారు.
దీనికి సంబంధించిన టూర్ షెడ్యూల్‌ను సోమవారం ఖరారు చేశారు. ఈ నెల 4వ తేదీ నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. ఇప్పటికే పన్నుల భారం, విద్యుత్ కోతలు, బస్సు, విద్యుత్ ఛార్జీల పెంపుతో పార్టీ ఆధ్వర్యంలో బాదుడే – బాదుడు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
జిల్లాల పర్యటనలో భాగంగా చంద్రబాబు ఈ నిరసన కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొని కేడర్‌లో జోష్‌ను నింపనున్నారు. ఈ నెల 4వ తేదీన శ్రీకాకుళం జిల్లా నుంచి తన పర్యటనను ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం దల్లా వలస గ్రామంలో చంద్రబాబు పర్యటన జరగనుంది.
5వ తేదీన భీమిలీ నియోజకవర్గం తాళ్లవలస, 6వ తేదీన ముమ్మడివరం నియోజకవర్గం కోరింగలో చంద్రబాబు పర్యటిస్తారు. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా వరుస పర్యటనలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలను పార్టీ రూపొందిస్తోంది. తొలుత ఈ మూడు ప్రాంతాల్లో పర్యటన సాగనుంది.
ఈ నెల 27న మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో అప్పటివరకు చంద్రబాబు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయన సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా కుప్పంలో కూడా చంద్రబాబు పర్యటన త్వరలోనే జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ యంత్రాంగం చేస్తోంది. మరోవంక, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహితం మహానాడు తర్వాత తన పర్యటన కార్యక్రమం వెల్లడింపనున్నట్లు తెలిపారు. ఆయన కూడా విస్తృతంగా పర్యటిస్తారని చెబుతున్నారు.