బహిరంగ ప్రదేశాల్లో ప్రాంక్ వీడియోలు షూట్ చేసిన హీరో విశ్వక్ సేన్, అతడి యూనిట్ పై న్యాయవాది అరుణ్ కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ (హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు చేశారు. తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు ఆదివారం విశ్వక్ ఒక ప్రాంక్ వీడియో షూట్ చేయడం కలకలం రేపింది. తన కారు ముందు ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు విశ్వక్ సీన్ క్రియేట్ చేసి షూట్ చేయగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
ఓ సినిమా పబ్లిసిటీ కోసం ప్రజలను భయాందోళనకు గురి చేసి, న్యూసెన్స్ చేసిన వారిపై చర్యలకు ఆదేశించాలని హెచ్ఆర్సీని ఆ న్యాయవాది కోరారు. ఇలాంటి వీడియోలు యువతపై నెగెటివ్ ప్రభావాన్ని చూపుతాయని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.
కాగా, ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో ఈ ఫ్రాంక్ వీడియోపై చర్చించేందుకు ఆహ్వానించగా ఆమె వేసిన ప్రశ్నకాలు విశ్వక్ సేన్ సహనం కోల్పోయి అనుచిత భాష వినియోగించడంతో ఇంటర్వ్యూ చేస్తున్న ప్రముఖ యాంకర్ ఆ నటుడిని వెంటనే బైటకు వెళ్లిపొమ్మనమని ఆగ్రహంతో గెంటివేసిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విశ్వక్ సేన్ హీరోగా రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఈనెల 6న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విడుదలలోగానే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ “ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు ప్రాంక్ వీడియో చేశాం. అయితే ఆతర్వాత జరిగిన పరిణామాలకు చింతిస్తున్నా. వివాదంతో నా సినిమాకు హైప్ తెచ్చుకోవాలనే దురాశ నాకు లేదు”అని చెప్పారు. దర్శకుడు విద్యాసాగర్ చింతా మాట్లాడుతూ “విశ్వక్సేన్ ఎలాంటి పాత్రనైనా చేస్తారు. ఈ సినిమాలో విశ్వక్ కనిపించరు… అర్జున్‌కుమార్ అల్లం మాత్రమే కనిపిస్తారు”అని పేర్కొన్నారు.