విశ్రాంత ఐఏఎస్ అధికారిణి, బీజేపీ నాయకురాలు రత్నప్రభ ఎస్సీ కాదంటూ వచ్చిన పిటిషన్‌పై దర్యాప్తు జరపాలని నాంపల్లి మూడో మెట్రో పాలిటిన్ కోర్టు పోలీసులను ఆదేశించింది. రత్నప్రభ ఎస్సీ కాదని ఈ వ్యవహారంపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలంటూ ఏవీ రమణ అనే వ్యక్తి నాంపల్లి మూడవ మెట్రోపాలిటన్ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేశారు.
కర్ణాటక ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఆమె గత ఏడాది తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. రత్నప్రభ ఫిర్యాదు మేరకు 2012లో రమణపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దాంతో సీసీఎస్ అధికారులు రమణను అరెస్టు చేశారు.
అయితే రత్నప్రభకు షేక్‌పేట మండల అప్పటి తహసీల్దార్ చంద్రకళ ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చారని, రత్నప్రభ షెడ్యూల్డ్ క్యాస్ట్ కాదని ఆ సర్టిఫికెట్ ఉపయోగించి తనపై అక్రమంగా అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఆరోపించారు.
ఆమెకు ఆ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని ఈ సర్టిఫికెట్ వ్యవహారంపై కూడా విచారణ జరపాలంటూ ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు. అలాగే అప్పటి పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్‌పై కూడా కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో న్యాయస్థానం ఈ మొత్తం వ్యవహారంపై కేసు నమోదు చేయాలంటూ బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది.
