పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. టోర్నీ ఆసాంతం అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన భారత బృందం.. ఆదివారం జరిగిన ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేసియాను 3-0 తేడాతో మట్టికరిపించి థామస్ కప్ 2022 స్వర్ణాన్ని చేజిక్కించుకుంది.
ఉత్కంఠభరితంగా సాగిన టైలో లక్ష్య సేన్ 8-21, 21-17, 21-16తో ఆంథోనీ గింటింగ్‌ను ఓడించడంతో భారత్‌కు సరైన ఆరంభం లభించింది. భారత డబుల్స్ జోడీ సాత్విక్ , చిరాగ్ అహ్సన్-సుకముల్జోను ఓడించారు!
18-21, 23-21, 21-19తో తమ కెరీర్లోనే అత్యంత సంచలన విజయం సాధించి భారత్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించింది. మూడో గేమ్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-15, 23-21తో జొనాటన్ క్రిస్టీని ఓడించి 3-0తో సమం చేశాడు. ఫైనల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఈ ఘనత సాధించారు.
భారత బృందం ఫైనల్ చేరే క్రమంలో (నాకౌట్ దశలో) మలేసియా, డెన్మార్క్ లాంటి పటిష్టమైన జట్లను ఖంగుతినిపించింది. థామస్ కప్ గెలిచన భారత బ్యాడ్మింటన్ జట్టుకు ప్రభుత్వం రూ. కోటి నగదు బహుమతి ప్రకటించింది. ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
73 ఏళ్ల కలను సాకారం చేసిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించిన భారత షట్లర్లకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌కు స్వర్ణ పతకం ఖాయం కాగానే మోదీ ట్వీట్ చేశారు.