దేశవ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఈశాన్య రాష్ట్రాలైన ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో ఆదివారం 49 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం (ఐఎండి) పేర్కొంది. తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండటతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, జమ్ముకాశ్మీర్, లఢఖ్, ఉత్తరాఖండ్, గిల్గిత్ -బాల్టిస్తాన్, పంజాబ్, బీహార్‌లోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని, సాధారణం కంటే 5.1 డిగ్రీలు అధికంగా నమోదైందని ఐఎండి తెలిపింది. ఢిల్లీలో సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో 45.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
వాయువ్య ఢిల్లీలోని ముంగేష్పూర్, నైరుతి ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ వాతావరణ కేంద్రాల్లో వరుసగా 49.2, 49.1డిగ్రీల సెల్సియస్‌గా రికార్డైనట్లు ఐఎండి వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని బందా జిల్లాలో అత్యధికంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మేలో బందాలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని ఐఎండి పేర్కొంది. జిల్లాలో 1994న 48.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమగాలుల ప్రభావంతో సోమవారం ఢిల్లీలోని ఎన్‌సిఆర్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గాలిదుమ్ము కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
కేరళలో భారీ వర్షాలు
ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరోవైపు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, లక్షద్వీప్‌లలో ఆదివారం వరుసగా 52.2మి.మీ, 57.7 మి.మీ వర్షపాతం నమోదైంది. ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్సూర్, మలప్పురమ్, కొజికోడ్లలో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మే 27 నాటికి కేరళలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండి తెలిపింది.
జూన్ ఒకటి నాటికన్నా ఐదురోజుల ముందే పలకరించనున్నట్లు వివరించింది. అండమాన్ సముద్రంలోకి నైరుతి రుతుపవనాలు సోమవారం వచ్చే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఆదివారం రాత్రి వెల్లడించింది. ఆదివారమే వస్తున్నట్లు అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు తొలుత వెల్లడించినప్పటికీ రుతుపవనాలు ప్రవేశించలేదు. అంచనా వేసిన తేదీకి వెనుకా ముందూ నైరుతి రావడం అనేది సర్వసాధారణమైన విషయమని అధికారులు తెలిపారు. సోమవారం నాటికి నైరుతి ఆగమనం ఉంటుందని తాజాగా నిర్ధారించారు.
ఉత్తర కోస్తా, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 2.1 కిలోమీటర్లు నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉంది. ఇది ఎత్తుకు వెళ్లే కొలదీ నైరుతి వైపు వంగి ఉంది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలోకి వచ్చాక, నికోబార్ దీవులు, దానిని ఆనుకుని ఉండే ఆగేయ బంగాళాఖాతానికి విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
