మానవ అక్రమ రవాణాను కట్టడి చేయడం కోసం జారీచేసిన జిఓను అమలు పరచడంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు ట్రాఫికింగ్ భాదితులతో పనిచేస్తున్న హెల్ప్ సంస్థ, రాష్ట్ర స్థాయి సెక్స్ వర్కర్స్ , సర్వైవర్స్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఫోరమ్ విముక్తి జరిపిన అధ్యయనంలో వెల్లడైంది,
జనవరి 2015 నుండి ఆగస్టు 2020 వరకు ఈ జిఓ అమలు స్థితిని అర్థం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేసింది. 20 ఏప్రిల్ 2022 న మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో జిఓ అమలు చేసిన్నట్లు తెలిపారు.
అయితే, ఎటువంటి కారణం లేకుండానే అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో వారి ప్రతిస్పందన విఫలమైందని, సమాధానమిచ్చిన ప్రశ్నలు కూడా రాష్ట్రంలోని క్షేత్ర స్థాయిలో అమలు తీరుకు వాస్తవ పరిస్థితికి భిన్నంగా అనేక వైరుధ్యాలను కలిగి ఉన్నాయి. దానితో అందించిన సమాచారం ఖచ్చితత్వాన్ని ప్రశ్నార్ధకం చేశాయి.
ఈ అంశాలను మీడియా సమావేశంలో విముక్తి ఉపాధ్యక్షురాలు శ్రీమతి..రజని, ప్రధాన కార్యదర్శి శ్రీమతి.బి.పుష్ప, హెల్ప్ సంస్థ కార్యదర్శి రామ్ మోహన్ నిమ్మరాజు, ప్రాజెక్ట్ మేనేజర్ వి భాస్కర్ వివరించారు. ఈ జిఓను పూర్తిగా అమలు జరపాలని, ఆదుకున్న వారందరికీ తక్షణం పూర్తిగా పునరావాసం, ఇతర సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. వారు మాటలలో:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్యపరమైన లైంగిక దోపిడీ కోసం మహిళలు, పిల్లల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ఖచ్చితమైన చర్యలను చేపట్టేందుకు జీ.ఓ. నం 1/2003 & 28 ను జారీ చేసింది. రాష్ట్రంలో అక్రమ రవాణా పరిస్థితిని సమీక్షించడానికి, అలాగే అక్రమ రవాణా బాధితులను రక్షించడం, పునరావాసం, పునరేకీకరణ మరియు వారిని జన జీవన స్రవంతి లో చేర్చేందుకు తగిన చర్యలను అమలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీని ఈ జీ.ఓ ద్వారా ఏర్పాటు చేసింది.
అంతేకాకుండా, అక్రమ రవాణా నిరోధం, బాధితుల రక్షణ, పునరావాసం కోసం చర్యలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీలను కూడా ఈ జిఓ ఏర్పాటు చేసింది.పేదరికం, నిరక్షరాస్యతతో సహా దాని మూల కారణాలను పరిష్కరించడం ద్వారా అక్రమ రవాణాను నిరోధించే నిబంధనలను ఈ జిఓలో చేర్చింది.
భాదిత మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడం, మైనర్ భాదితుల కోసం విద్యా సేవలను అందించి ప్రోత్సహించడం, రెండవ తరం అక్రమ రవాణాను నిరోధించడానికి ప్రమాదంలో ఉన్న పిల్లలకు రెసిడెన్షియల్ ట్రాన్సిట్ పాఠశాలలు ఏర్పాటు చేయడం కోసం జిల్లా కమిటీలు ఖచ్చితంగా పని చేయాలని నిర్దేశించింది. ఇంకా, భాదిత మహిళల పునరావాసం, తక్షణ ఉపశమనం మరియు సహాయక సేవలను జిల్లా కమిటీలు తప్పనిసరిగా అందించాలి.
కాగా, మొదటిగా, రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ 2015 నుండి 2020 మధ్య సమావేశాలు నిర్వహించిందా లేదా అనే దానిపై పూర్తిగా స్పందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇది మొత్తం ట్రాఫికింగ్ పరిస్థితిని పర్యవేక్షించడానికి, అక్రమ రవాణా భాదితుల కోసం పథకాలను అమలు చేయడానికి బాధ్యత వహించే రాష్ట్ర స్థాయి నోడల్ బాడీ అని పరిగణనలోకి తీసుకుంటే, వారి సమావేశాలలో ఏ ఒక్క ముఖ్య సమాచారం కూడా ఉనికిలో లేదు.
ఒకవేళ కనీసం సమావేశాలైనా నిర్వహించారా అనే దానిపై కూడా. ఇది ఆందోళనకరం. అంతేకాకుండా, శ్రీకాకుళం, కడప, అనంతపురం, నెల్లూరు, విజయనగరంలో ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించలేదని, విశాఖపట్నంలో 2 సమావేశాలు నిర్వహించినప్పటికీ, 2015 నుండి 2020 మధ్య ఒక్క బాధితుడు కూడా లబ్ధి పొందలేదని జిల్లా కమిటీల డేటా చూపించింది.
ప్రకాశం జిల్లాలో ఇచ్చిన ఆర్టీఐ స్పందన ప్రకారం, 2015 నుంచి 2020 వరకు 8 జిల్లా స్థాయి సమావేశాలు జరిగాయి, ఇవి ” ప్రభావిత ప్రాంతాలలో మహిళలు, బాలికలకు అవగాహన శిబిరాలు నిర్వహించే కమ్యూనిటీ నిఘా కమిటీలను బలోపేతం చేయడం గురించి చర్చించాయి . ఇది 26 మంది బాధితులకు ప్రయోజనం చేకూర్చింది.
అయితే, ప్రకాశం జిల్లా కమిటీలో సభ్యత్వం గల హెల్ప్ సంస్థకు 2015 నుండి ఒక్క జిల్లా స్థాయి సమావేశం కూడా ఆహ్వానం అందలేదు. అందువల్ల, రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితికి విరుద్ధంగా నిరాధారమైన సమాచారాన్ని అందించిన్నట్లు స్పష్టం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ రవాణాను నిరోధించే ప్రయత్నాలు కేవలం ట్రాఫికింగ్‌కు వ్యతిరేకంగా నిర్వహించే అవగాహన ప్రచారాలకు మాత్రమే పరిమితం చేశారు. వాస్తవానికి అక్రమ రవాణా మూల కారణాలను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలు, చేపట్టిన కార్యక్రమాలు చాలా తక్కువగా ఉన్నాయి.
ఉదాహరణకు, ట్రాఫికింగ్‌కు మొట్టమొదటి మూలకారణమైన పేదరికాన్ని పరిష్కరించడానికి, 2015 నుండి 2020 మధ్యకాలంలో ప్రకాశం జిల్లాలో 26 మంది మానవ అక్రమ రవాణా భాదితులకు మాత్రమే ఆర్థిక సాధికారత కల్పించింది. మరే ఇతర జిల్లా కూడా అలాంటి ప్రయత్నాలను చేపట్టలేదు.
ఇంకా, అక్షరాస్యతను మెరుగు పరిచేందుకు జిఓ లో ఆదేశాలు ఉన్నప్పటికీ, రెండవ తరం ట్రాఫికింగ్‌ను నిరోధించడానికి ప్రభుత్వం అక్రమ రవాణాకు గురైన భాదితుల పిల్లలకు రెసిడెన్షియల్ ట్రాన్సిట్ పాఠశాలలను ఏర్పాటు చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫికింగ్‌కు గురైన భాదిత బాలలకు అందిన స్కాలర్షిప్లు సున్నా.
2015 నుండి 2020 వరకు స్కూల్ డ్రాపౌట్లను నివారించడానికి గాను 6 మంది బాలలు మాత్రమే ట్యూషన్ సేవలను పొందారు. కేవలం ఇద్దరు బాధితులను మాత్రమే అనాథలుగా ప్రకటించి ప్రయోజనాలు అందించారు.
ఎన్‌సిఆర్‌బి 2020 నివేదిక విడుదల చేసిన డేటా ప్రకారం, ముఖ్యంగా వ్యాపార లైంగిక దోపిడీ కోసం ఏపీలో ప్రబలంగా సాగుతున్న మానవ అక్రమ రవాణా తీవ్రత ఆందోళనకరంగా ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ఈ విషయంలో మూడవ స్థానాన్ని ఆక్రమించింది.
భారత ప్రభుత్వ ఎన్ సి ఆర్ బి డేటా ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో 2016 నుండి 2020 వరకు మానవ అక్రమ రవాణా కేసుల స్థితి ఇలా ఉంది: 2016 నుండి 2020 వరకు, భారతీయ శిక్షాస్మృతి, 1860 (ఐపీసీ) నిబంధనల ప్రకారం దాదాపు 1,669 మంది అక్రమ రవాణా బాధితులు ఐ పి సి క్రింద, 550 మంది బాధితులు (మొత్తం 2219 మంది) ఐ టి పి ఎ (మానవ అక్రమ రవాణా (నివారణ) చట్టం, 1955) కింద రక్షింపబడ్డారు.
కానీ కనీసం 5-10 శాతం మంది కూడా పునరావాసం, తక్షణ ఉపశమన సేవలు, బాధితుల పరిహారంతో పాటు ఎలాంటి సమగ్ర సహాయ సేవలను కూడా ప్రభుత్వం ద్వారా పొందలేదు. ఈ పరిస్థితుల పర్యవసానాలు వారిని మళ్లీ తిరిగి అక్రమ రవాణాకు గురయ్యేలా చేస్తున్నాయి.
ఎన్‌సిఆర్‌బి నివేదిక ఆధారంగా 2016-20 మధ్యకాలంలో రక్షించిన మొత్తం 2219 మంది బాధితులలో, ప్రభుత్వం ఆర్టిఐ ప్రతిస్పందన నుండి ఇచ్చిన సమాచారం మేరకు ఏపీలో కేవలం 55 మంది బాధితులు మాత్రమే తక్షణ ఉపశమన సహాయాన్ని పొందారు, ఇది మొత్తం రక్షించిన వారిలో 2 శాతం మాత్రమే. ఇంకా 102 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 601 మంది బాధితులు పునరావాస సహాయాన్ని పొందారు, ఇది మొత్తం రక్షించిన వారిలో 27 శాతం. ఇంకా 51 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
అయితే, కృష్ణా, గుంటూరు, నెల్లూరు కడప, కర్నూలు, అనంతపురంలో 2015 నుంచి 2020 మధ్య ట్రాఫికింగ్‌కు గురైన ఒక్కరిని కూడా ట్రాఫికింగ్ నిరోధక స్క్వాడ్ రక్షించలేదు. ఇంకా, దోపిడీదారుల ఆస్తులను జప్తు చేయడానికి, కోర్టులో భాదితులకు పరిహారం చెల్లించడానికి చట్టంలో నిబంధనలు ఉన్నప్పటికీ, అక్రమ రవాణా బాధితుల ప్రయోజనం కోసం ఈ నిబంధనలను ఉపయోగించుకున్న కేసులు ఆంధ్రప్రదేశ్ కోర్టులలో శూన్యం.
నేరాలకు పాల్పడినందుకు ట్రాఫికర్లకు ఎప్పుడూ జరిమానా విధించబడలేదు. అన్ని జిల్లాలలో చూస్తే, కేవలం ప్రకాశం జిల్లాలో మాత్రమే అక్రమ రవాణా కేసులను సమర్ధవంతంగా విచారించిందని, కోర్టుల ముందు సంగ్రహంగా పరిష్కరించబడ్డాయని పేర్కొంది.
అక్రమ రవాణా భాదితుల పునరావాసం, తక్షణ ఉపశమన సహాయం, సహాయక సేవలను అందించడానికి జిల్లా కమిటీలు బాధ్యత వహించినప్పటికీ, రక్షించబడిన వారిలో 60 శాతం మందికి ఇప్పటికీ తక్షణ ఉపశమనం, ఎలాంటి సహాయం లభించలేదు. కేవలం కృష్ణా జిల్లాలో మాత్రమే అక్రమ రవాణా నుండి బయటపడిన వారికి పక్కా గృహాలు అందించారు.
గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నంలలో చాలా తక్కువ మంది బాధితులకు మాత్రమే న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయి. వైద్య సేవలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి, ప్రకాశం జిల్లాలో బాధితులకు మాత్రమే హెల్త్ కార్డులు అందించారు. కర్నూలు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో బాధితులకు మాత్రమే ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.
అక్రమ రవాణాలో హెచ్ఐవి బాధితులు కూడా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే సేవలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర జిల్లాలు పెద్దలు లేదా పిల్లలు అనే తేడా లేకుండా ట్రాఫికింగ్ నుండి బయటపడిన వారికి పునరావాసం, మద్దతు కోసం దాదాపు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.
ఆంధ్రప్రదేశ్ లో 2015 నుండి 2020 మధ్య అధిక సంఖ్యలో ట్రాఫికింగ్ బాధితులను రక్షించినప్పటికీ, వారిలో కొద్ది శాతం మాత్రమే పునరావాసం, తక్షణ ఉపశమనం, సహాయక సేవలను అందుకున్నారు . రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం 2015 నుండి 2020 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని మెజారిటీ జిల్లాల్లో ఈ జిఓ అమలు కాలేదని స్పష్టమవుతుంది.
సమర్థవంతమైన ప్రజా సేవా వ్యవస్థను అమలుచేసేందుకు గ్రామ, వార్డు స్థాయి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గొప్ప ప్రయోజనం ఉంది. కాబట్టి, మానవ అక్రమ రవాణా నుండి బయటపడిన వారి సమగ్ర అభివృద్ధికి గాను కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్ మోడల్లో ఈ వాలంటీర్ సేవలను ఇది ఉత్తమంగా ఉపయోగించుకోగలదు.
మహిళా పోలీసింగ్ సేవలతో సహా ఈ వార్డు, గ్రామ సచివాలయాల్లో మహిళలు, పిల్లల సంక్షేమం మరియు రక్షణ కోసం వివిధ విభాగాలు ఉన్నాయి. తద్వారా రక్షించబడిన భాదితులకు వారి స్వంత కమ్యూనిటీల్లోనే తగినంత రక్షణ, సహాయ సేవల మద్దతు ఉంటుంది. సోర్స్ ఏరియాల్లోని ట్రాఫికర్లు ప్రాసిక్యూషన్ నుండి తప్పించుకోలేరు. దీని ఫలితంగా వారికి శిక్షలు పడే శాతం కూడా పెరుగుతుంది.
అంతే కాకుండా, అదే గ్రామంలో వారి సామాజిక-ఆర్థిక సాధికారత కోసం ట్రాఫికింగ్ నుండి రక్షించబడిన, వాణిజ్య లైంగిక దోపిడీ బాధితులకు జీవనోపాధి, ఉద్యోగ అవకాశాలను అందించడానికి వీలు కలుగుతుంది. అంతేకాక స్థానిక సచివాలయాల వాలంటీర్ల ద్వారా భాదితులకు ఇప్పటికే అమలులో ఉన్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించవచ్చు.