తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన సందర్భంగా శనివారం పలువురు నేతలతో సమాలోచనలు ప్రారంభించారు. తొలుత సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలో తుగ్లక్ రోడ్-23లోని కేసీఆర్ నివాసంలో ఇద్దరు నేతలు విందు సమావేశం జరిపారు.
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి ప్రస్తావన వచ్చినట్లు సమాచారం.
ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరం గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. సౌత్ మోతీ భాగ్ లోని ఆ స్కూల్‌ని సందర్శించి అక్కడి సౌలతులు, తరగతి గదులను పరిశీలించారు. సర్కారు స్కూళ్లలో పరిస్థితులపై కేజ్రీవాల్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీరిరువురు ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ లను కూడా సందర్శించారు.
ఢిల్లీ విద్యా విధానం దేశానికే ఆదర్శమని సీఎం కేసీఆర్ కొనియాడారు. దేశమంతటా ఢిల్లీ తరహా విద్యావిధానం ఉండాలని ఆకాంక్షించారు. కానీ కేంద్రం తెచ్చిన కొత్త విధానం ఏకపక్షంగా ఉందని చెబుతూ ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు వస్తాయని స్పష్టం చేశారు.
తమ రాష్ట్రంలో ఢిల్లీ తరహా విధానాన్ని అమలు చేయకపోయినా తెలంగాణ టీచర్లను ఢిల్లీకి పంపి ఓరియెంటేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మరోవైపు దేశంలో సంచలనం రావాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్ అది తప్పకుండా వస్తుందని చెప్పారు. రాజకీయాల్లో ఏం జరుగుతుందో ముందు ముందు చూడాలని తెలిపారు.