దేశంలో చాలా కాలం తర్వాత తొలిసారి పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఉజ్వల పధకం క్రింద గ్యాస్ ధరలను సహితం భారీగా తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుస ట్వీట్లు చేశారు.
దీంతో పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7 మేర తగ్గుతుందని ఆమె ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజల ప్రయోజనాలే తమకు తొలి ప్రాధాన్యమంటూ ఆయన సదరు ట్వీట్లో వ్యాఖ్యానించారు. శనివారం తీసుకున్న కీలక నిర్ణయాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గేలా తీసుకున్న నిర్ణయంతో పలు రంగాలకు సానుకూల ప్రభావం లభించనుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయంతో దేశ ప్రజలకు ఊరట లభించనుందని, వారి జీవితాలను మరింత సులభతరం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్వీట్‌కు నిర్మలా సీతారామన్ పెట్రో ధరలను తగ్గిస్తూ చేసిన ట్వీట్‌ను ఆయన జత చేశారు.
అదేవిధంగా, ప్రధాని ఉజ్వల్ యోజన గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి వంట గ్యాస్ సిలిండర్‌పై రూ 200 సబ్సిడీని (12 సిలిండర్ల వరకూ) ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి ఈ నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరనుంది.
కాగా నిర్మాణ రంగానికి కూడా సానుకూల సంకేతాలు అందిస్తూ సిమెంట్ ధరలను భారీగా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. సిమెంట్ లభ్యతను మెరుగుపరచడం తో పాటు మెరుగైన లాజిస్టిక్స్ ద్వారా సిమెంట్ ధరను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే దిగుమతి ఆధారిత ఎక్కువగా ఉన్న.. ప్లాస్టిక్ ఉత్పత్తులకు ముడి పదార్థాలు మధ్యవర్తులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా తగ్గిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
మరోవైపు ఐరన్, స్టీల్‌పైనా.. సంబంధిత కొన్ని ముడి పదార్థాలపై దిగుమతి సుంకం తగ్గించినట్లు తెలిపారు. అయితే కొన్ని ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధించబడుతుందని ఆమె స్పష్టం చేశారు. ప్లాస్టిక్ ఉత్పత్తులకు సంబంధించిన ముడి పదార్థాలపై కూడా కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ఆమె తెలిపారు