2001లో అటల్ బిహారీ వాజ్‌పేయ్ జాతికి అంకితం చేసిన ఐఎస్ బి ఇప్పుడు ఆసియాలోని టాప్ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఐఎస్బీ 20వ వార్షికోత్సవంలో మోదీ పాల్గొంటూ ఐఎస్ బీ లో ఇప్పటి వరకు శిక్షణ తీసుకున్న 50 వేల మంది దేశ విదేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలను నడుపుతున్నారని తెలిపారు.
స్టార్టప్ లు, యూనికార్న్ ల నిర్మాణంలోనూ వారి భాగస్వామ్యం ఉండటం దేశానికి గర్వకారణమని ప్రధాని ప్రశంసించారు. ఐఎస్ బి తన ప్రయాణంలో కీలక మైలురాయిని చేరిందన్నారు. ఐఎస్ బి ఈ స్థాయికి రావడం వెనుక చాలా మంది కృషి ఉందని చెప్పారు.
వచ్చే 25ఏళ్లకు రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నామని చెబుతూ ఆ ప్రణాళికల్లో ఐఎస్ బికి చాలా కీలక పాత్ర ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. జి20 దేశాల్లో భారత్ అతి వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొంటూ ఇంటర్నెట్ వాడకంలో భారత్ రెండో స్థానంలో ఉందని, ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్ లో ఉందని మోదీ గుర్తు చేశారు.
కరోనా కష్టకాలంలో భారత్ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని ప్రధాని గుర్తు చేశారు. ఇండియా అంటేనే బిజినెస్ అనే స్థాయికి భారత్ చేరుకుందని చెప్పారు. భారత్ అభివృద్ధి కేంద్రంగా మారుతున్నందున గతేడాది రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు వచ్చాయని మోదీ తెలిపారు. ఇది ఒక్కరి వల్ల సాధ్యం కాలేదని, యువత భాగస్వామ్యంతోనే సాధించగలిగామని స్పష్టం చేశారు.
అంతుకు ముందు ఐఎస్బీ ప్రాంగణంలో ప్రధాని మొక్క నాటారు. అనంతరం 20వ వార్షికోత్సవ ఫ్లాగ్ ను ఆవిష్కరించారు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు తన చేతుల మీదుగా ప్రధాని మెడల్స్ అందజేశారు.