త్రివిధ దళాలకు నియామకాల్లో భారీ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. టూర్ ఆఫ్ డ్యూటీ/అగ్నిపథ్ పథకంలో భాగంగా భారత సైన్యం, భారత నావికా దళం, భారత వాయు సేనలలో నియమితులయ్యే నూటికి నూరు శాతం మందిని నాలుగేళ్ళ తర్వాత విధుల నుంచి విడుదల చేయాలని, ఓ నెల తర్వాత మాత్రమే వీరిలో 25 శాతం మందిని పూర్తి స్థాయిలో సర్వీస్ లోకి తీసుకోవాలని ప్రతిపాదించారు.
టూర్ ఆఫ్ డ్యూటీ స్కీమ్ తుది రూపంపై చర్చలు జరుగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ తుది రూపానికి త్వరలోనే ఆమోదం లభించి, దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నూతనంగా నియమితులైన వారిలో కొందరిని శిక్షణ కాలంతోపాటు మూడేళ్ళ సర్వీస్ పూర్తయిన తర్వాత విడుదల చేయాలని ప్రారంభ ప్రతిపాదనలు చెప్తున్నాయి.
ఐదేళ్ళ కాంట్రాక్చువల్ సర్వీస్ అనంతరం మరింత మందిని విడుదల చేసి, చివరికి దాదాపు 25 శాతం మందిని పూర్తి స్థాయిలో సర్వీస్ లకు నియమించాలని భావిస్తున్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం, ఈ కొత్త పథకం ద్వారా నియమితులైన నూటికి నూరు శాతం మందిని నాలుగేళ్ళ సర్వీస్ అనంతరం విడుదల చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత దాదాపు 30 రోజుల అనంతరం వీరిలో 25 శాతం మందిని మళ్ళీ పిలిచి, కొత్త జాయినింగ్ డేట్‌తో సైనికులుగా నియమించాలి. వేతనాలు, పింఛన్లను నిర్ణయించడం కోసం అంతకుముందు వీరు పని చేసిన నాలుగేళ్ళ కాలాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. దీనివల్ల పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.
కాగా, ఆర్మీ మెడికల్ కార్ప్స్ వంటి సాంకేతిక స్వభావం గల ఉద్యోగాల్లో నియమితులైన వారికి ఈ నాలుగేళ్ళ కాంట్రాక్చువల్ సర్వీస్ విధానంలో నాలుగేళ్ళ తర్వాత విడుదల చేసే పద్ధతి నుంచి మినహాయింపు ఇస్తారని భావిస్తున్నారు. సాంకేతిక శిక్షణ పొందిన వారిని నేరుగా పారిశ్రామిక శిక్షణా సంస్థల నుంచి నియమించుకోవాలనే ప్రతిపాదన వచ్చిందని చెబుతున్నారు.
దీనివల్ల వారి శిక్షణ కోసం సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. ఈ విషయంలో అధ్యయనం చేయాలని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. సైన్యంలో దాదాపు రెండేళ్ల నుంచి నియామకాలు జరగడం లేదు. దీంతో యువత తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియామకాలను తిరిగి ప్రారంభించే నాటికి తమ వయోపరిమితి మించిపోతుందని, వెంటనే నియామకాలు ప్రారంభించాలని హర్యానా, పంజాబ్ యువత ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.