ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు కధనాలు వాస్తు ఉండడంతో ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ కూడా తీవ్రమైన కసరత్తు చేస్తున్నది. గత నెల ఒంగోలులో జరిగిన పార్టీ మహానాడుకు విశేష స్పందన లభించడంతో, పార్టీ కార్యకర్తలలో ఆ ఉత్సాహాన్ని కొనసాగించే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
మరోసారి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు ఏడాది పాటు ఆయన ప్రజల్లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ లోగా ఎన్నికల ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. గత నెలల్లో కొన్ని జిల్లాలో పర్యటించినప్పుడు కూడా అనూహ్య స్పందన లభించడం గమనార్హం.
ఈ నెల మూడో వారం నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు. బుధవారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు ఇతర ముఖ్య నేతలతో చర్చించి ఈ నిర్ణయాన్ని టీ-డీపీ అధినేత తీసుకున్నారు. పర్యటనల్లో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రధానంగా ప్రస్తావించి ఎండగట్టానున్నారు.
అలాగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా ప్రతి జిల్లాలో జిల్లా మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పర్యటనల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు చంద్రబాబు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 26 జిల్లాలలో ఏడాది పాటు విస్తృత పర్యటనలు సాగించనున్నారు. ప్రతి జిల్లాలో 3 రోజుల టూర్ ఉండేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు.
ప్రతి జిల్లాలో మొదటి రోజు బహిరంగ సభ, రెండో రోజు పార్లమెంట్‌లోని 7 అసెంబ్లీ ఇంచార్జ్‌లతో సమీక్షలు, క్యాడర్‌తో ఆత్మీయ సమావేశాలు చంద్రబాబు నిర్వహిస్తారు. జిల్లా టూర్లో మూడో రోజు వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షో ఉండేలా కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నారు.
ఏడాదిలో 80కి పైగా నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటనలు సాగనున్నాయి. అటు- జిల్లాల పర్యటనలు, ఇటు- కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవహారాలు సమాంతరంగా సాగేలా షెడ్యూల్‌ను పార్టీ నేతలు రూపొందిస్తున్నారు.