రాష్త్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా తమ ఇష్టం వచ్చిన్నట్లు రహ్ట్రాలలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్రంకు డెప్యూటేషన్ పై తీసుకు వచ్చేందుకు వీలు కల్పిస్తూ చేసిన ప్రతిపాదనలకు బిజిపేతర రాష్ట్ర ప్రభుత్వాలు మోకాలడ్డడంతో కేంద్రం వెనుకడుగు వేయవలసి వచ్చింది. .
అఖిల భారత సర్వీస్ అధికారుల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్న కేంద్రం 2021, డిసెంబరులో ఓ ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం.. ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎ్ఫఓఎస్) అధికారులను డిప్యూటేషన్‌పై తీసుకొచ్చేందుకు కేంద్రానికి అధికారాలు దాఖలు కానున్నాయి. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం కేంద్రానికి అవసరంలేదు.
తాజా ప్రతిపాదనను తెలంగాణతోపాటు మరో 7రాష్ట్రాలు వ్యతిరేకించాయి. కాగా, కేంద్ర ప్రతిపాదనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం (డీవోపీటీ) తెలిపింది. అంతకు మించి వివరాలు ఇవ్వబోమని స్పష్టం చేసింది.
దీంతో, రాష్ట్రాల్లో పనిచేసే కేంద్ర సర్వీసుల అధికారులను డిప్యూటేషన్ పై కేంద్రానికి బదిలీచేసే ప్రతిపాదనలకు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. కాగా, ఐఏఎస్ (క్యాడర్) రూల్స్, 1954లో ప్రతిపాదిత సవరణపై స్పందించాలని డిసెంబరు 20, 2021న రాష్ట్రాలను డీవోపీటీ కోరిన విషయం తెలిసిందే.
గత ఏడాది డిసెంబరు 27, ఈ ఏడాది జనవరి 6న మరోసారి అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రాలకు కూడా గుర్తు చేసింది. అనంతరం ఈ ఏడాది జనవరి 12న ప్రతిపాదిత సవరణలను డీవోపీటీ మరోసారి సవరించింది. దీని ప్రకారం రాష్ట్రాలు అంగీకరించకున్నా అఖిలభారత సర్వీసు ఉద్యోగులను రిలీవ్ చేసి డిప్యూటేషన్‌పై కేంద్ర విభాగాల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రానికి అధికారం ఉంటుంది.
డీవోపీటీ చేసిన ఈ సవరణకు 8 రాష్ట్రాలు.. తెలంగాణ, ఒడిశా, మేఘాలయ, ఝార్ఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు అభ్యంతరం చెప్పాయి. మరోవైపు, ప్రస్తుత నిబంధనలను అనుసరించి కేంద్ర డిప్యూటేషన్ కింద తగినంత మంది అధికారులను రాష్ట్రాలు స్పాన్సర్ చేయడంలేదు.
చాలా సందర్భాల్లో కేంద్ర సర్వీసుల్లో పనిచేయడానికి అధికారులు ఆసక్తి చూపడంలేదని డీవోపీటీ వర్గాలు తెలిపాయి. 2014లో 19 మంది మధ్య-స్థాయి (మిడ్ లెవెల్) ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసుల్లో ఉండగా 2021 నాటికి 10 శాతానికి పడిపోయింది.
కాగా, వివిధ మంత్రిత్వశాఖల్లో 23 మంది జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులను నియమించుకునేందుకు కేబినెట్ నియామక కమిటీ (ఏసీసీ) ఇప్పటికే ఆమోదం తెలిపింది. వీరిలో ఆరుగురు ఐఏఎ్‌సలు, ఒక్కరు మాత్రమే ఐపీఎస్ అధికారి ఉన్నారు. కేంద్రంలో గత ఏడాది నవంబరు నాటికి జాయింట్ సెక్రటరీ స్థాయి పోస్టులు 20 ఖాళీగా ఉన్నాయి.
కేంద్ర ఉద్యోగుల ఉన్నత ర్యాంకుల పరంగా చూసుకుంటే జాయింట్ సెక్రటరీ అంటే మూడో అతిపెద్ద స్థాయి హోదా. ‘‘లేటరల్ ఎంట్రీ’’ విధానం కింద కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖల్లో జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ పోస్టుల భర్తీకి గత ఏడాది యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ 31 మంది అభ్యర్థులను సిఫారసు చేసింది. వీరంతా ప్రైవేటు రంగానికి చెందినవారే కావడం విశేషం. లేటరల్ ఎంట్రీ కింద 2019లో 9 మందిని యూపీఎస్సీ ఎంపిక చేయగా.. ఇద్దరు అధికారులు ఉద్యోగంలో చేరిన తర్వాత రాజీనామా చేశారు.