జులై 1 నుండి కేంద్ర ప్రభుత్వం నూతన టిడిఎస్ (మూలం నుండి పన్ను మినహాయింపు) నిబంధనలను ప్రవేశపెట్టనుంది. ఈ నూతన నిబంధనలతో సోషల్‌మీడియా మార్కెటింగ్, వైద్యులపై పన్ను భారం పడనుంది.
సేల్స్ ప్రమోషన్ కోసం కొన్ని సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. వ్యాపారం నుండి పొందే ప్రయోజనాలపై (టిడిఎస్)ద్వారా పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నూతన టిడిఎస్ నిబంధనలతో వీటిపై కూడా పన్ను విధించనున్నారు.
సంవత్సరంలో రూ.20 వేల కంటే అధిక ప్రయోజనాన్ని అందించే ఏ వ్యక్తి అయినా పది శాతం టిడిఎస్‌కి అర్హులని ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి) కొత్త నిబంధన వర్తింపుపై మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 కొత్త సెక్షన్, 194ఆర్ని కొత్తగా జత చేయడం ద్వారా టిడిఎస్ నిబంధనను ప్రవేశపెట్టింది.
వ్యాపారం వృద్ధిలో భాగంగా కొన్ని కంపెనీలు వైద్యులకు అందించే ఉచిత మెడిసిన్ శాంపిల్స్‌తో పాటు విదేశీ విమాన టిక్కెట్లు లేదా వ్యాపార సమయంలో ఐపిఎల్ ఉచిత టికెట్లు వంటి ప్రయోజనాలపై టిడిఎస్ వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కమలేష్ సి. వర్ష్నే తెలిపారు.
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు వీటిని బహిర్గతం చేయాలని, ఈ వస్తువులను విక్రయించడం లేదనే పేరుతో లెక్కల్లో చూపకుండా ఉండకూడదని వర్ష్నే స్పష్టం చేశారు. అలాగే డిస్కోంట్, రిబేట్ కాకుండా టివి, కంప్యూటర్, బంగారు నాణేలు, మొబైల్ ఫోన్లతో పాటు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చే విక్రేతలకు కూడా 194ఆర్ సెక్షన్ వర్తిస్తుందని తెలిపారు.