సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దాడి వెనుక ఆరోపణలు ఎదురుకుంటున్న ఆవుల సుబ్బారావును ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నుండి ఆయన్ను విచారించబోతున్నారు. నరసరావు పేట సాయి ఢిపెన్స్ అకాడమీ నుంచి ఆవుల సుబ్బారావుని పోలీసులు హైదరాబాద్ తీసుకెళ్లారు.
సికింద్రాబాద్ విధ్వంసంలో సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు. అల్లర్లలో 10 బ్రాంచ్‌ల విద్యార్థులున్నట్లు పోలీసులు గుర్తించారు. అభ్యర్థులను రెచ్చగొట్టడంతోపాటు ఉదంతం జరగడానికి ముందు రోజు రాత్రి సికింద్రాబాద్ వచ్చాడని, ఘటన జరిగిన రోజు కొన్ని గంటలు అక్కడే ఉన్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు.
అయినా, ఇప్పటి వరకు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయక పోవడం, కనీసం విచారణ కూడా చేయక పోవడంతో అతనిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు చెలరేగాయి. అతనికి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కధనాలు వెలువడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికార రాజకీయ పార్టీల నేతలతో పాటు, ప్రముఖ రాజకీయ నేతలతో అతనికి గల సన్నిహిత సంబంధాలే అందుకు కారణం అనే విమర్శలు వచ్చాయి.
సుబ్బారావుకు ఇప్పటికే దాదాపుగా క్లీన్చిట్ ఇచ్చిన పోలీసులు అదే సమయంలో శాంతియుతంగా నిరసన తెలపడానికి గుంటూరుకు వస్తున్న 31 మంది నిరుద్యోగ యువకులపై క్రిమినల్ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం గమానార్హం. నిజానికి సికింద్రాబాద్ సంఘటనలో సుబ్బారావు పేరును తెరమీదకు తెచ్చింది పోలీసులే!
సంఘటన జరుగుతుండగానే ఆయన పేరును మీడియాకు లీక్ చేసింది పోలీసు అధికారులే! ‘నర్సరావుపేటకు చెందిన సాయిడిఫెన్స్ అధినేత ఆవుల సుబ్బారావు మనకు మద్దతుగా హైదరాబాద్ వస్తున్నారు… మిగిలిన అకాడమీల డైరక్టర్లు కూడా స్పందించాలి’ అంటూ ఉన్న వాట్స్అప్ మెసేజ్ కూడా పోలీస్ అధికారుల నుండే మీడియా ప్రతినిధులకు అందింది. ఘటనలో పాల్గొన్న ఆర్మీ అభ్యర్థుల వాట్స్అప్ గ్రూపుల నుండి దానిని సేకరించామ న్నారు. ఇటువంటివే మరికొన్ని అంశాలను కూడా చెప్పారు.
ప్రత్యేక పోలీస్ బృందాలను పంపి సుబ్బారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతర చర్యలకు సిద్ధపడక పోవడంతో పాటు ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవని ప్రకటించడం అనుమానాలకు దారి తీస్తోంది. వాట్స్అప్ మెసెజ్ గురించి అడిగిన ప్రశ్నలకు ‘ ఆ మెసేజ్‌లో ఆయన పేరు ఉన్న విషయం నిజమే. దానిని పంపిన అభ్యర్థులను విచారించాల్సిఉంది.’ అని చెప్పడం విశేషం. పైగా, అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సుబ్బారావు మాట్లాడినట్లు ‘ఆన్ రికార్డు’ (సోషల్ మీడియా, వీడియో పోస్టులు) లభించలేదన్నది పోలీసుల వాదన!
సికింద్రాబాద్ ఘటనపై సిట్ దర్యాప్తు జరుగుతుండగానే సుబ్బారావుకు దాదాపుగా క్లీన్చిట్ ఇవ్వడం వెనుక రాజకీయ వత్తిడులే ఉండవచ్చని తెలుస్తున్నది.