మొన్నటి వరకు తగ్గుముఖం పడుతూ వస్తున్న కరోనా దేశంలో మళ్ళి విజృంభిస్తున్నది. తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం 13 వేల మంది కరోనా బారినపడగా, నేడు కొత్తగా 17,336 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,33,62,294కు చేరాయి.
ఇందులో 4,27,49,056 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,954 మంది మృతిచెందారు. మరో 88,284 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 13 మంది మరణించగా, 13,029 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 5218 కేసులు ఉన్నాయి. కేరళలో 3890 కేసులు, ఢిల్లీలో 1934, తమిళనాడులో 1063, హర్యానాలో 872, కర్ణాటకలో 858 కేసుల చొప్పున నమోదయ్యాయి.
కాగా, పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాటివిటీ 4.32 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా యాక్టివ్ కేసులు 0.20 శాతం, రికరీ రేటు 98.59 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. దేశంలో ఇప్పటివరకు 196.77 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా నెమ్మదిగా కరోనా కేసులు పెరుగుతూ ఉండడం కలవరం కలిగిస్తున్నది. గురువారం తెలంగాణ వ్యాప్తంగా 494 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు సైతం 1.71 శాతానికి పెరిగింది. హైదరాబాద్ జిల్లాలో 315 కేసులు నమోదయ్యాయి.
గురువారం నమోదైన కేసుల్లో 90 శాతం కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య మూడు వేలు దాటింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 315, రంగారెడ్డిలో 102, మేడ్చల్ మల్కాజిగిరిలో 31, సంగారెడ్డిలో 11 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం తదితర కోవిద్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
ఇక, ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం, ఎన్టీఆర్ విజయవాడ, కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో గడిచిన వారం రోజులుగా 70కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో అతికొద్ది మంది ఆసుపత్రుల్లో చేరగా మిగిలిన వారు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లి, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలతో పోలిస్తే తీవ్రత తక్కువే కాబట్టి ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది.
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేపీ పెరగడం ఫోర్త్ వేవ్‌కు సంకేతమనే అభిప్రాయాలను వైద్య వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. మొత్తం 26 జిల్లాలకుగాను ఇప్పటి వరకు నాలుగైదు జిల్లాల్లోనే మాత్రమే కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి కాబట్టి పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.