జులై 2, 3 తేదీలలో హెచ్ఐసీసీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి, 3 వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా తెలంగాణ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో ప్రధాని రెండు రోజుల పర్యటన సందర్భంగా భద్రతలో భాగంగా కనీసం ఐదువేల మంది పోలీసులను మోహరింప చేస్తున్నారు.
సమావేశ వేదిక వెలుపల రాష్ట్ర పోలీసులు మూడంచెల భద్రతా విధానాలను అమలు చేస్తున్నారు. అయితే ఎస్పీజీ కమాండోలు, కేంద్ర భద్రతా సిబ్బంది హెచ్ఐఐసీ, నోవాటెల్ మైదానాల్లో కాపలాగా ఉంటారు. ఎస్పీజీలు, ఇతర కేంద్ర బలగాలతో కమ్యూనికేట్ చేయడానికి, భద్రతా సంస్థలతో సమన్వయం చేయడానికి, పరిమిత సంఖ్యలో ఐపీఎస్ అధికారులను మాత్రమే సమావేశ మందిరం లోపల అనుమతించనున్నారు.
ప్రధానమంత్రి కార్యాలయం, ఎస్పీజీ సీనియర్ అధికారులు తెలంగాణ పోలీసు సిబ్బందితో మాట్లాడి భద్రతా చర్యల గురించి మరింత తెలుసుకున్నారు. ప్రధానమంత్రి మినిట్ టూ మినిట్ ప్రోగ్రామ్ షెడ్యూల్‌ను రూపొందించడంపై పోలీసు ఉన్నతాధికారులు చర్చించారు. వర్షాకాలం కావడంతో వాతావరణ నివేదికను పొందాలని భద్రతా అధికారులు వాతావరణశాఖ అధికారులను కూడా ఆదేశించారు.
విమానాల రాకపోకలు సజావుగా సాగించేందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి మాదాపూర్ హెచ్ఐసీసీ వరకు ట్రయల్ రన్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, పరిసర జిల్లాల్లోని వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రుల భద్రత కోసం అదనపు బందోబస్తును సిద్ధంగా ఉంచాలని పోలీసు అధికారులు సంబంధిత శాఖల నుంచి ఆదేశాలు జారీ చేశారు.
ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర పార్టీ నేతలతో సహా దాదాపు 340 మంది బీజేపీ అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ వెల్లడించారు.
ప్రధాన మంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టిన ఎనిమిదేళ్ళలో నగరంలో రెండు రోజులు గడపడం ఇదే తొలిసారి కావడంతో పోలీసులు బందోబస్తుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఆహుతులందరికీ కేంద్ర పార్టీయే ప్రత్యేకంగా తయారు చేసిన పాస్‌లను జారీ చేయనుంది. సమావేశంలో పాల్గొంటున్న వారి పేరు, హోదా తదితరాలతో పాటు ఫొటోను కూడా ముద్రించిన పాస్‌లకు బార్‌కోడ్‌ను కూడా ఉంచనున్నారు.
సమావేశ ప్రాంగణంలో కానీ, గదిలో కానీ అనుమానిత వ్యక్తుల కదలికలను గమనిస్తే భద్రతా సిబ్బంది పార్టీ జారీ చేసిన పాస్‌ను స్కాన్ చేసి వివరాలను క్షణాలలో తెలుసుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ప్రధాని భద్రతా సిబ్బందితో పాటు బ్లాక్ క్యాట్ కమెండోలు, సీఆర్పీఎఫ్, ఆర్ఎఎఫ్ తదితర సిబ్బంది, ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం కోసం రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులకు బాధ్యతలను అప్పగించారు.